భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Saturday, April 16, 2011

పుట్టపర్తిలో దొంగలు పడ్డారు! బాబాకు రూ.1.30 లక్షల కోట్ల ఆస్తులు! సాయి సంపద చుట్టూ చోరులు వాళ్లూ వాళ్లూ పంచుకు తింటున్నారు

loading
ఐటీ కోర్ బిల్డింగ్‌లో చోర్ పనులు
దేశ విదేశాలకు ఆన్‌లైన్‌లో డబ్బు తరలింపు
'మినీ స్విస్ బ్యాంక్'లా పుట్టపర్తి
బడా బాబుల నల్లధనం అక్కడే భద్రం
మంత్రులు, సీఎంలు, మాజీలకు ఖాతాలు?
విశ్రాంతి మందిరంలో టన్నుల్లో బంగారం?
బాబాకు జబ్బుతో సూత్రధారులు అప్రమత్తం
రాత్రింబవళ్లు సాగుతున్న సెటిల్‌మెంట్లు 


ధనమా.. దైవమా...
దైవం చుట్టూ ధన ప్రవాహమా...
ధనం కోసమే దైవ ప్రదక్షిణలా...
పుట్టపర్తిలో ఏం జరుగుతోంది...
ఎప్పటి నుంచి జరుగుతోంది...
నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ...
ధనమే దైవం!

భగవాన్ సత్యసాయి బాబా నిర్మించుకున్న భక్తి సామ్రాజ్యంలో 'దొంగలు' పడ్డారు! బాబా అస్వస్థతకు గురైనప్పటి నుంచి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి దూరిన పాముల్లా... పుట్టపర్తిలో పేరుకుపోయిన అపార సంపద చుట్టూ చేరారు. బాబా కంట పడకుండా, మరో కంటికి తెలియకుండా పుట్టపర్తిని చీకటి సామ్రాజ్యంగా మార్చారు. బాబా తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో... ఈ 'చీకటి దొంగలు' అప్రమత్తమయ్యారు. భగవంతుడికి భక్తులు సమర్పించుకున్న సంపదను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. పంపకాల పర్వంలో మునిగి తేలుతున్నారు.

ఎంతెంత డబ్బు?

సత్యసాయి ట్రస్టుకు ఒక అంచనా ప్రకారం ఎక్కడ ఎంత విలువైన ఆస్తులున్నాయంటే.....
పుట్టపర్తిలోని స్కూళ్లు, ప్రశాంతి నిలయం పట్టణ వాటిక, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇతర భవనాలు - రూ.4,000 కోట్లు
పుట్టపర్తి విమానాశ్రయం - రూ.300 కోట్లు
బెంగళూరులోని విడిది మందిరం, అక్కడి సూపర్
స్పెషాలిటీ ఆస్పత్రి - రూ.5,000 కోట్లు
మహారాష్ట్రలోని ఆస్తులు - రూ.10,000 కోట్లు
కొడైకెనాల్‌లో - రూ.1,000 కోట్లు
ఢిల్లీలోని ఆస్తుల విలువ - రూ.1,000కోట్లు
(వివిధ రాష్ట్రాల్లో ఉండే ధ్యాన మందిరాలు కోట్ల విలువ చేస్తాయి.)

ఎంత బంగారం?

ప్రశాంతి నిలయం ఒక బంగారు కొండ అని చెబుతారు. బాబాకు నగదు రూపంలో వచ్చిన కానుకలకంటే... బంగారం రూపంలో అందిన విరాళాలే అధికమని చెబుతారు. వజ్ర వైఢూర్యాలూ లెక్కలేనన్ని ఉన్నట్లు సమాచారం. లెక్కాపత్రం లేని బంగారమంతా ఎప్పుడో కరిగిపోయింది. ఇంకా... సుమారు పది టన్నుల బంగారాన్ని బాబా సేదతీరే మందిరంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. సూత్రధారుల దృష్టి ఈ బంగారంపైనా కేంద్రీకృతమైంది.

సెంట్రల్ ట్రస్టు బోర్డు అర్జెంట్ మీటింగ్

పుట్టపర్తి రహస్యాలపై వరుస కథనాలు... 'ఆంధ్రజ్యోతి' సంధిస్తున్న అక్షర శరాలు... అక్రమార్కుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కథనాలతో ఉలిక్కిపడ్డ ట్రస్టు సభ్యులు శనివారం ప్రశాంతి నిలయంలో రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. బాబా ఆరోగ్యం, ఆయనకు అందిస్తున్న చికిత్సతోపాటు... 'ఆంధ్రజ్యోతి' కథనాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. సత్యసాయి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే... చెక్కులపై బినామీ సంతకాలు చేయిస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు... కేబినెట్ సమావేశంలోనూ 'ఆంధ్రజ్యోతి' కథనాలపై చర్చ జరిగింది. పుట్టపర్తి సంగతులను గాలికి వదిలేశారనే విమర్శల నేపథ్యంలో... ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని తిరిగి పుట్టపర్తికి పంపాలని నిర్ణయించింది. ఇక... సాయిబాబా ఆరోగ్యంపై డాక్టర్ సఫాయా ఎప్పట్లాగానే ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం మీద ఆయన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు నిపుణులు కూడా బాబాకు చికిత్స అందిస్తున్నటు ్లతెలిపారు.

హైదరాబాద్, ఏప్రిల్ 16 : పుట్టపర్తి అంటే.... భగవాన్ సత్యసాయి బాబా, ఆయన భక్తులు మాత్రమే కాదు! ఇదో విశాల సామ్రాజ్యం! దేశ దేశాల్లో ఉన్న ట్రస్టు స్థిరాస్తులతోపాటు ప్రశాంతి నిలయంలో ఉన్న కోట్లలో నగదు, టన్నుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాల విలువ లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా!

ఇది సాయిబాబాను సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా నమ్మి, నివేదించుకున్న భక్తి 'సంపద'. ఇలా భక్తులు సమర్పించుకున్న దానిలో కొంతమాత్రమే ట్రస్టు ఖాతాలో పడుతోంది! మిగిలింది... ట్రస్టులోని కొందరు సభ్యుల సొంత ఖాతాల్లో జమ అవుతోంది. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత... ఈ డబ్బును అత్యంత రహస్యంగా, పకడ్బందీ భద్రత మధ్య తరలించే కార్యక్రమం మొదలైంది.

ప్రశాంతి నిలయానికి సమీపంలో ఉండే ఐటీ కోర్ బిల్డింగ్ నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వేదికగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యంతో ఆడుకుంటూ... మరోవైపు ఐటీకోర్ బిల్డింగ్ కేంద్రంగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా హడావుడి పెరిగింది. కంప్యూటర్ల కీ బోర్డులు టకటకలాడుతున్నాయి.

సుమారు 165 దేశాల్లోని పలువురు వ్యక్తుల ఖాతాల్లో ఆన్‌లైన్ మార్గంలో డబ్బులు పడిపోతున్నాయి. ఈ బిల్డింగ్ శత్రు దుర్బేధ్యం. నల్లధనమైనా, తెల్లధనమైనా, హవాలా అయినా, ఏ దేశ కరెన్సీ అయినా... ఇక్కడి నుంచి క్షణాల్లో ఆన్‌లైన్‌లో సర్దుబాట్లు జరిగిపోతుంటాయి. గత నెల 28న బాబా ఆస్పత్రి పాలయ్యాక ఐటీ కోర్ బిల్డింగ్‌ను దోపిడీ సూత్రధారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నమ్మిన బంట్ల ద్వారా వాటాలు సెటిల్ చేసుకుంటున్నారు.

బడా చోరులు... ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది, సెటిల్‌మెంట్లు జరుగుతున్నది భక్తులు కానుకగా సమర్పించుకున్న సంపదే కాదు! ఎందరో ప్రముఖులు దాచుకున్న నల్ల డబ్బు కూడా! ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. పోలీసులు, ఆదాయపు పన్ను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులెవరూ ప్రశాంతి నిలయం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దీంతో ట్రస్టులోని కొందరు వ్యక్తులు ప్రశాంతి నిలయాన్ని ఒక హవాలా కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి.

బడా బడా వ్యక్తులు, ప్రముఖులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు పుట్టపర్తిని 'అత్యంత సురక్షితమైన' స్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల నగదు దాచుకోవడం... అవసరమైనప్పుడు తీసుకోవడం... ఇదో హవాలా బజార్! పుట్టపర్తి వ్యవహారాలను చాలా ఏళ్లపాటు దగ్గరుండి పరిశీలించిన ఒక పోలీసు అధికారి మాటల్లో చెప్పాలంటే... 'ఇది ఒక మినీ స్విస్ బ్యాంక్'. కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఇక్కడ 'ఖాతాలు' తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం.

మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ 2 వేల కోట్లు దాచుకున్నట్లు సమాచారం. బాబా అస్వస్థతకు గురి కాగానే... ఆ నాయకుడు పరిగెత్తుకుంటూ పుట్టపర్తికి వచ్చారు. అలాగే... మహారాష్ట్రకే చెందిన ఓ మాజీ మంత్రి పుట్టపర్తిలో మరో వెయ్యి కోట్లు పెట్టినట్లు చెబుతున్నారు. సత్యసాయికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలు చూడాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే... ఈ 'నల్ల' కార్యక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి.

ఇప్పుడు ఈ రహస్య లావాదేవీలన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దల్ని, కొందరు అధికారుల్ని ముందుగానే మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది... సూత్రధారుల మధ్య పంపకం! 
బాబా... నీకు దిక్కెవరు ?
Babasపుట్టపర్తి, మేజర్‌న్యూస్‌: సత్య సాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదా? శనివారం నాటి పరిణామాలు నిశితంగా గమనిస్తే ఈ అనుమానం తలెత్తుతున్నది. అమెరికా నుంచి హఠాత్తుగా ఇద్దరు డాక్టర్లు పుట్టపర్తి వచ్చారు. బాబా ఆరోగ్యంలో చెప్పుకోదగిన మెరుగుదల ఇప్పటికీ కనిపించక పోవడం..కొత్తగా డాక్టర్లు రావ డంతో ఇక్కడి వాతావరణం మరింత నిశ్శబ్దాన్ని సంత రించుకుంది. డాక్టర్ల బులెటిన్లు రాను రాను మొక్కుబడి గాను, మరింత అయోమయంగాను ఉండటం భక్తుల్లో గందరగోళాన్ని పెంచుతున్నది. బాబా శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలు కృత్రిమ ఏర్పాట్లపైనే పని చేస్తున్నాయని డాక్టర్‌ సఫాయా శనివారం కూడా ప్రకటించారు.

అదే సమయంలో బాబాకు రక్తపోటు, హృదయ స్పందన సాధారణ స్ధాయిలోనే ఉన్నాయని అంటూనే, ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఐసీయూలో ఉండి, కృత్రిమ ఏర్పాట్లపై చికిత్స పొందే ఈ తరహా పేషెంట్ల ఆరోగ్య స్థితిగతుల్లో ఇన్ని రోజుల తర్వాత గుణాత్మకమైన మెరుగుదల కనిపించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు. ఇన్ని రోజుల పాటు దేశ విదేశాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు బాబాను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెబుతూ వస్తున్న డాక్టర్‌ సఫాయా శనివారం కీలక సమాచారం ఇచ్చారు. అమెరికా నుంచి తాజాగా మరో ఇద్దరు డాక్టర్లు వచ్చా రని, బాబా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఆ డాక్టర్లు పరిశీలిస్తున్నారని ఆయన ప్రకటించారు. అమె రికా నుంచి డాక్టర్‌ కల్పనాలత, డాక్టర్‌ శ్రీధర్‌ హుటా హుటిన శనివారం పుట్టపర్తి చేరుకున్నారు. అయితే వీరు ఎందుకొచ్చారన్నది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు.

ముందు నిర్ణయించిన ప్రకారమే వీరు వచ్చారా? లేక బాబా ఆరోగ్యంలో హఠాత్‌ మార్పుల కారణంగా కొత్త కోణంలో డయాగ్నసిస్‌ చేసేందుకు కొత్త వారిని రంగంలోకి దింపారా అన్నది స్పష్టం కావడం లేదు. ఒక కోణంలో చూస్తే ఈ పరిణామం సంచలనాత్మకమే. ముందు నిర్ణయించిన ప్రకారమే అయితే ఇంతకు ముందే ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పి ఉండేవారని భావిస్తున్నారు. మరి ఇంత హడావుడిగా, హఠాత్తుగా అమెరికా నుంచి డాక్టర్లని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చిందని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇన్ని రోజుల తర్వాత కూడా బాబా ఆరోగ్యం ఇసుమంతైనా మెరుగుపడకపోవడంతో డాక్టర్లలో ఆత్మ పరిశీలన మొదలైందని అంటున్నారు.

ఇక ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలు సమకూర్చడంలో ఎటూ పాలుపోని స్థితిలో అమెరికా నుంచి వైద్యులను పిలిపించారన్న అనుమానాలు మొదలయ్యాయి. బాబా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను కొత్త కోణంలో వీక్షించి, చికిత్సలో ఏమైనా మార్పులు చేయాలేమో కనుక్కుని, అందుకనుగుణంగా చర్యలు తీసుకునే యోచనలో ఆసుపత్రి డాక్టర్లు ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల నుంచి తీవ్రమైన వత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆ విమర్శల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే తాజాగా అమెరికన్‌ డాక్టర్లను పిలిపించారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. పరిస్థితిని వారికి వివరించి, బాబాను వారికి అప్పగించి, తాము చేతులు దులుపుకొనే ప్రయత్నంలో ట్రస్ట్‌ ఉందని అంటున్నారు.

‘ప్రశాంతి’కి బాబా తరలింపు సాధ్యమేనా?
సాయిబాబా ఆసుపత్రిలోనే ఉన్నా, ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నా, ఆ ఆసుపత్రి, ఆ డాక్టర్లు ఏకమొత్తంగా సెంట్రల్‌ ట్రస్ట్‌ నిఘా కళ్ల మాటునే పని చేస్తున్నదన్నది అక్షర సత్యం. అందుకే ట్రస్ట్‌ మీద, ఆ డాక్టర్ల మీద భక్తుల్లో కోటి అనుమానాలు. ఆ దాడి నుంచి తప్పించుకునే వ్యూహమే ఇదని చెబుతున్నారు. అంతే కాదు. ఆసుపత్రిలో ఉంచడం ద్వారా, ఐసీయూలోకి ఎవ్వర్నీ అనుమతించకపోవడం ద్వారా ఏదో గూఢుపుఠాణీ జరుగుతున్నదన్న అపోహలకు ఆస్కారమిచ్చిన ట్రస్ట్‌, ఆసుపత్రి డాక్టర్లు ఆలస్యంగా కళ్లు తెరిచినట్లు కనిపిస్తున్నది.

అందుకే ఆసుపత్రి నుంచి బాబాను ప్రశాంతి నిలయానికి మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే బాబాను పదిహేను రోజుల్లో ప్రశాంతి నిలయానికి తెచ్చేస్తామంటూ శుక్రవారం ట్రస్ట్‌ తొలిసారి ప్రకటన చేసింది. అంటే తమ మీద మచ్చ పడకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే బాబా మకాంని ప్రశాంతి నిలయానికి మార్చాలని వారు నిర్ణయించినట్లు కనిపిస్తున్నది. అమెరికా నుంచి రప్పించిన వైద్యులకే బాబా ఆరోగ్య బాధ్యతను అప్పగించి, వారికి ఆ ప్రశాంతి నిలయంలోనే సకల వసతులు కల్పించి భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందుకోసమే ప్రశాంతి నిలయంలోనే ఒక ఐసీయూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ఏర్పాట్లు మరికొన్ని కొత్త అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రశాంతి నిలయంలోనే ఐసీయూ నెలకొల్పుతున్నారంటే బాబా ఆరోగ్యం ఇప్పట్లో సాధారణ స్ధితికి చేరదని డాక్టర్లు ఒక అభిప్రాయానికి వచ్చారా అన్న అనుమానం కలుగుతోంది. అంతే కాదు. బాబా ఇక శాశ్వతంగా అలా బెడ్‌ మీదే ఉంటారా? అలా కృత్రిమ ఏర్పాట్లతోనే గడపాలా? ఆయన లేచి కనీసం చక్రాల కుర్చీలోనైనా భక్తులకు దర్శనం ఇవ్వలేరా? ఈ ప్రశ్నలే భక్తులను నిద్ర పోనివ్వడం లేదు. ఒకవేళ బాబా ఆరోగ్యం ఆందోళన కరంగానే ఉంటే..ఆయన్ని ప్రశాంతి నిలయానికి మార్చాల్సిన అగత్యం ఏమొచ్చిందని పుట్టపర్తి వాసులు ప్రశ్నిస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయనడంలో సందేహం లేదు.

అందులోనూ సత్య సాయిబాబా తానే నెలకొల్పిన అత్యంత ఆధునికి ఆసుపత్రిలో ఆయనే ఇష్టపడి నియమించుకున్న నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరగడాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కాకపోతే అసలేం జరుగుతోందో సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించడాన్నే ప్రజలు, భక్తులు తప్పుబడుతున్నారు. అలాంటప్పుడు ఆ పారదర్శకతను పాటిస్తూ, అక్కడే వైద్యం అందిస్తే ఎవ్వరూ కాదనరు. కాని ఇంకా కోలుకోని బాబాను ఏకంగా ప్రశాంతి నిలయానికి తరలించే ఆలోచనే సవ్యంగా లేదని భక్తులు అంటున్నారు. ఐసీయూలో ఉన్న బాబానే చూసేందుకు వీల్లేదని చివరకు ముఖ్యమంత్రికే అవకాశం కల్పించని దశలో బాబాను మరో చోటకు తరలించాలని నిర్ణయించడంలోని మర్మమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. బాబా కోలుకోలేని సుదీర్ఘ సమస్యలతో బాధపడుతున్నారా? ఆయనిక మంచం మీదే ఉండాలా? తాజాగా ఈ అనుమానాలు బలంగా భక్తుల మనసులను కలచివేస్తున్నాయి.

మంత్రులు మాట్లాడరా?
బాబా ఆరోగ్యం గురించి మొన్న మొన్నటి దాకా పుట్టపర్తిలోనే ఉండి వచ్చిన మంత్రులు సైతం పెదవి విప్పకపోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బాబా కళ్లు తెరిచారని, హారతి కావాలా అంటే సానుకూలంగా తల తిప్పారని ఆమధ్య రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ఆనందంగా చెబుతూనే అంతలోనే కళ్లనీళ్లపర్యంతమయ్యారు. మరి ఆ తర్వాత అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదా? బాబా కళ్లు తెరవడం లేదా? ఆమె ఆ ప్రకటన చేసిన తర్వాత అనేక సార్లు బాబా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటూ డాక్టర్లు ప్రకటనలు చేశారు. భక్తులు ఆందోళన చెందుతున్న దశలో బాధ్యత గల మంత్రిగా ఆమె వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అంతే కాదు. సత్యసాయి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చేందుకు, భక్తుల్లో అనుమానాల నివృత్తి చేసేందుకు కొందరు మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మంత్రుల బృందం పుట్టపర్తిలోనే ఉండి, నేరుగా బాబాను చూడగలిగే అధికారం ఉండాలని, డాక్టర్లు వారికి నివేదించే ఏర్పాటు ఉన్నప్పుడే ఆ బృందం తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించగలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశంతో ఆ మధ్య పుట్టపర్తి వెళ్లిన కమిటీలో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఉన్నారు. మరి ఆయన వెళ్లిన అవసరం ఏమిటి? వెళ్లి ఏమి చేసి వచ్చారు? అది తెలుసుకునే బాధ్యత బాబా భక్తులకు లేదా? తెలుసుకునే అధికారం లేదా? మరి ప్రభుత్వం కూడా తన బాధ్యతను మరిచి ఎందుకని పారదర్శకతను పాటించడం లేదు? ఈ ప్రశ్నలకు భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

డాక్టర్లు తీర్చని సందేహాలు

  • బాబాకు పచ్చకామెర్లు (జాండిస్‌) తగ్గాయా? కనీసం తగ్గుముఖం పడుతున్నాయా?
  • కాలేయం సవ్యంగా పని చేస్తున్నదా?
  • మూత్రపిండాలకు డయాలిసిస్‌ చేస్తున్నారా? తొలి నాళ్లలో చేస్తున్నన్ని సార్లు ఇప్పుడూ చేయాల్సివస్తున్నదా?
  • శ్వాస క్రియ పరిస్థితేమిటి? కృత్రిమ ఏర్పాట్లు ఇంకా ఎంత కాలం అవసరం?
  • ఆహారం ఏమిస్తున్నారు?
  • రోజులో ఎంత సేపు కళ్లు తెరుస్తున్నారు? స్పృహలో ఉంటున్నారా?
  • డాక్టర్లను గుర్తిస్తున్నారా? కనీసం తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నానన్న విషయం ఆయనకు తెలుసా?
  • ఆసుపత్రిలో చేరకముందుతో పోలిస్తే బాబా ఇప్పుడు ఎంత బరువు తగ్గారు?
  • బాబా బంధువులనైనా ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారా?
  • బాబా పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఎన్ని రోజులు పడుతుందన్న తాత్కాలిక అంచనా మీ దగ్గర ఉందా?
  • డాక్టర్లలో ఎవరెవరికి బాబా గదిలోకి నేరుగా వెళ్లేందుకు అనుమతి ఉంది?
  • డాక్టర్లు కాకుండా ఇతరులు బాబాను చూసేందుకు ఐసీయూలోకి వెళ్లగలుగుతున్నారు?
  • తాజాగా వచ్చిన అమెరికన్‌ డాక్టర్లకు ఏమి బాధ్యతలు అప్పగించారు?
  • ఈ విషమ స్థితిలో బాబా భక్తులకు ట్రస్ట్‌, డాక్టర్లు జవాబుదారీగా ఉండాలా? లేదా? నిజానికి ఇవి ప్రశ్నలు కాదు. బాబా భక్తుల మనోగతం. వారి అంతరంగ ప్రతిధ్వనులు. అటు ట్రస్ట్‌ గాని, ఇటు డాక్టర్లు గాని, లేదా ప్రభుత్వం గాని బాబా విషయంలో కొత్త దృక్పథంతో పారదర్శకంగా భక్తులకు జవాబుదారీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment