భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Thursday, April 7, 2011

సత్యసాయి ట్రస్ట్ ఆస్తుల విలువ రూ. 1.50 లక్షల కోట్లు!

 సత్యసాయి బాబాకు సంబంధించిన సెంట్రల్ ట్రస్ట్ ఆస్తుల విలువ రూ. 1.50 లక్షల కోట్లు ఉంటుందని తెలిసింది. 1963లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు అధ్యక్షుడిగా సాయిబాబా, కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రవర్తి వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా డీమ్డ్ యూనివర్సిటీ వీసీగా వ్యవహరించిన ఎస్.వి.గిరి, బెంగళూరుకు చెందిన శ్రీనివాస్, దవే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భగవతి, ప్రముఖ వ్యాపారవేత్త సి.శ్రీనివాస్, ముంబైకి చెందిన హిందూలాల్‌షా, బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు ఆర్.వి.రత్నాకర్ ఉన్నారు. బాబాకు సంబంధించిన ఆరోగ్య విషయాల దగ్గర నుంచి మొత్తం వ్యవహారాలను ఈ ట్రస్ట్ బోర్డు పర్యవేక్షిస్తోంది. పుట్టపర్తిలోనే కాక ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.

ట్రస్టులో ఎలాంటి తగాదాలు లేవు: శ్రావణ్


సత్యసాయి బాబా కుటుంబీకులకు, సత్యసాయి ట్రస్ట్‌కు ఎలాంటి తగాదాలు లేవని బాబా మనవడు శ్రావణ్ స్పష్టం చేశారు. పుట్టపర్తిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబా ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలను భక్తులకు తెలియజేయాలని మీడియాను కోరారు. రేటింగ్స్ పెంచుకునేందుకు, సంచలనాల కోసం కొన్ని చానళ్లు, పత్రికలు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందరూ సమష్టిగా బాబా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నామన్నారు. బాబా తప్పకుండా తిరిగి ప్రశాంతి నిలయానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాయి ట్రస్ట్‌కు సర్కారు గాలం
bab-blessసత్యసాయిబాబా అనారోగ్యం బారిన పడిన తరువాత పుట్టపర్తిలో అంతర్గతంగా అనూ హ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు రూ.60 వేల కోట్ల విలువ చేసే సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌కు వారసుడెవరు? అనే ప్రశ్న ఉదయిస్తుండగా... ‘నేనున్నా’నంటూ ప్రభుత్వం సమాధానిమిస్తున్నట్లు కని పిస్తోంది. సెంట్రల్‌ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న సత్య సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించడం, ట్రస్ట్‌ ఆస్తుల విలువను అంచనా వేయడానికి ‘ప్రభుత్వ ప్రతినిధులు’ పుట్టపర్తిలోనే ఉంటూ మంతనాలు సాగి స్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక ఆదాయం ఉండే షిర్డీ సాయిబాబా ఆలయాలను హస్తగతం చేసుకోవడానికి గతంలో శతవిధాలా ప్రయత్నాలు సాగించి..చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో భంగపడిన ప్రభుత్వం మరోసారి అలాంటి ప్రయత్నాన్నే తెరమీదికి తెచ్చింది.

అనంతపురం జిల్లాకే చెందిన మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ జె గీతారెడ్డి కొద్ది రోజులుగా పుట్టపర్తిలోనే మకాం వేయడం... ట్రస్ట్‌పై కర్ర పెత్తనాన్ని సాధించడానికి ప్రభుత్వం తెరవెనుక చేస్తోన్న ప్రయత్నాలను, సర్కారీ పెద్దల ఉద్దేశాన్ని చెప్పకనే చెబు తోంది. సత్యసాయికి అందజేస్తోన్న వైద్య పరీక్షలను ఎప్ప టికప్పుడు పరీక్షించడానికి ప్రభుత్వం పుట్టపర్తికి పంపిన అయిదుగురు సభ్యుల ప్రత్యేక బృందంలో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులను చేర్చడం, అందులో ఒకరు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కావడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ లెక్కగట్టిన వివరాల ప్రకారమే సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మొత్తం ఆస్తులు రూ.40 వేల కోట్లు. దీనికి అదనంగా మరో రూ.20 వేల కోట్లు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. స్థిర, చరాస్తుల విలువే వేల కోట్లల్లో ఉండగా..ప్రతినెలా దేశ, విదేశాల నుంచి విరాళాల రూపంలో ట్రస్ట్‌కు అందే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

bhavansట్రస్ట్‌ ఆధీనంలో ఓ విశ్వవిద్యాలయం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మ్యూజియం, స్టేడియం, ప్లానిటోరియం, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయం, సంగీత కళాశాల, క్రీడా భవనాల సముదాయం, ఇండోర్‌ స్టేడియంల నిర్వహణ కొనసాగుతోంది. రాజమండ్రిలో ఓ గురుకుల పాఠశాల, న్యూఢిల్లీలో సత్యసాయి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫర్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ వంటి విద్యాలయాలు ఉన్నాయి. బెంగుళూరు నగరంలో వైట్‌ఫీల్డ్‌లో మరో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కొడైకెనాల్‌లో ‘సాయి శృతి’ పేరుతో సత్యసాయి ఆశ్రమం ఉంది. ఏటా వేసవిలో కాలంలో అంటే..ఏప్రిల్‌, మే నెలల్లో సత్యసాయి కొడైకెనాల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. దీనితోపాటు బెంగుళూరు నగరంలోని బృందావన్‌లో కూడా ఓ ఆశ్రమం ఉంది. ఇప్పటిదాకా వాటి నిర్వహణా బాధ్యత సెంట్రల్‌ ట్రస్ట్‌దే. వాటిన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

దాదాపు 180 దేశాల్లో సత్యసాయి భక్తులు ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మన దేశంలో కంటే విదేశాల్లో ఉన్న భక్తుల సంఖ్యే అధికం. వారి ద్వారా ప్రతినెలా కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో సత్యసాయి ట్రస్ట్‌కు అందుతున్నాయి. ఈ మొత్తాన్ని ఆయన ప్రజాసేవకే వినియోగిస్తున్నారనే చెప్పొచ్చు.
సూపర్‌ స్పెషాలిటీ ఆసుప్రతులు, డీమ్డ్‌ యూనివర్శిటీ వంటివి స్థాపించి వెనుకబడిన అనంతపురం జిల్లాలో విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. అలాగే..సత్యసాయి తాగునీటి పథకం కింద అనంతపురంజిల్లాలోని ప్రతి మారుమూల గ్రామానికీ ఆయన మంచినీటిని సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతున్నారు.

ఇంత ప్రాముఖ్యత ఉన్న సత్యసాయి ట్రస్ట్‌ ఇక ఎవరి పరమౌతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఎలాంటి వివాదాలకూ, పొరపచ్చాలకు అవకాశం ఇవ్వకుండా తానే స్వాధీనం చేసుకుని, ట్రస్ట్‌ ఆధీనంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూ..ఆస్తులన్నింటిపైనా ‘పవర్‌ ఆఫ్‌ అటార్నీ’ సాధించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.ట్రస్ట్‌ ఆస్తులను అంచనా వేయడానికే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను వైద్యాధికారుల బృందంలో ఒకరిగా పుట్టపర్తికి పంపించినట్లు తెలుస్తోంది.

ఆయనతో పాటు మరో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ పివి రమేష్‌ సైతం ఇప్పటికే ట్రస్ట్‌ ప్రతినిధులతో అంతర్గతంగా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉంది.
గతంలో రాష్ట్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి ప్రభుత్వం భంగపడిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో జీవోలు కూడా జారీ అయ్యాయి. అయితే షిర్డీ సాయి భక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ప్రయత్నాలకు తెరపడింది. మరోసారి అలాంటి తరహా ప్రయత్నానికే ప్రభుత్వం పూనుకుంది. దీనిపై అధికార వర్గాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కొందరు మౌనం వహిస్తుండగా..మరికొందరు కొట్టి వేస్తున్నారు.దేమైనప్పటికీ..ప్రభుత్వ ప్రయత్నాల పట్ల దేశ, విదేశాల్లోని సత్యసాయి భక్తుల నుంచి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment