భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Sunday, April 24, 2011

సత్యనారాయణరాజు నుంచి.. సత్యసాయిగా..

మానవసేవే మాధవసేవగా, సర్వ మత సారం సాయి అభిమతంగా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను ప్రబోధిస్తూ సత్యసాయిబాబా ప్రత్యక్షదైవంగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు బాబా బోధనలను ప్రత్యక్షంగా ఆలకించి, ఆయనను దర్శించుకునేందుకు ప్రతి ఏడాదీ ఇక్కడికి వస్తారు. తాము ఒక శాంతి, ప్రేమ, ఆధ్యాత్మిక ప్రపంచంలో
ఉన్నామన్న భావనతో స్వాంతన పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం గొల్లపల్లి (పుట్టపర్తి)లో ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిరు ప్రాయం నుంచే ఆయన ప్రత్యేక ప్రవర్తనతో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. పొరుగింటి కరణం సుబ్బమ్మ.. సత్యనారాయణరాజు ప్రవర్తనను గమనించి అతను గొప్పవ్యక్తి అవుతాడని చెబుతుండే వారు. చిన్ననాటి సత్యనారాయణరాజు బోధనలకు ఆమె ప్రచారం కల్పించారు. ఆయన బోధనలు ఇరుగుపొరుగు గ్రామాల వారిని ఆకర్షించాయి. పశువుల కాపరులు, సన్నిహితులు కోరిన కోర్కెలు తీరుస్తూ ఆయన మహిమలు చేసి చూపసాగారు. పుట్టపర్తిలోని ప్రాథమిక పాఠశాలలో 1931 నుంచి 1936 వరకు విద్యాభ్యాసం చేశారు. 6వ తరగతి నుంచి బుక్కపట్నంలో చదివారు. 1940లో ఉరవకొండలో 9వ తరగతి పూర్తి చేసి విద్యకు స్వస్తి పలికారు. అంతకు ముందు కొంత కాలం కడప జిల్లా (ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లా) కమలాపురంలో గడిపారు. తన 14వ ఏట ఉరవకొండలోని ఒక బండరాయిపై మల్లెపూలు చల్లి సత్యసాయి బాబా అని పేరును సృష్టించి అవతార పురుషునిగా ప్రకటించుకున్నారు.


అనంతరం గొల్లపల్లి చేరుకున్న బాబా.. ఆ గ్రామం పేరును పుట్టపర్తిగా నామకరణం చేశారు. తన బోధనలతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షించసాగారు. సత్యనారాయణరాజు భక్తులకు సత్యసాయిబాబాగా ఆరాద్యుడయ్యారు. 1941లో తన భవిష్యత్ వాణిని ప్రకటించారు. 1948లో ప్రశాంతి నిలయం మందిరాన్ని నెలకొల్పారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు బాబా కీర్తిప్రతిష్టలు జిల్లాలు, రాష్ట్రాలు, దేశం ఎల్లలు దాటి విశ్వవ్యాప్తమయ్యాయి. ప్రపంచ దేశాలకు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రశాంతి నిలయంలో సనాతన ధర్మాలను సూచించే స్థూపాన్ని నెలకొల్పారు. మానవసేవే మాధవసేవ అనే సూక్తిని నమ్మిన ఆయన ప్రేమతత్వానికి సేవా భావాన్ని జోడించి సమాజ సేవకు ఉపక్రమించారు. ‘జయతునాం నరజన్మనం దుర్లభం’ అనే రీతిలో ఎంతో ఉత్తమమైన మానవజన్మ ఎత్తిన మనిషి తనతోటి జీవులతో సఖ్యతగా మెలగాలని బోధించసాగారు. తోటి మనిషికి సాయం అందించని జన్మ నిరర్థకమన్నారు. అదే విధానాన్ని ఆయన పాటించి విద్య, వైద్యం, తాగునీటి పథకాలను అందించటమే కాదు.. దేశ వ్యాప్తంగా ఏ ఉపద్రవం ఏర్పడినా సాయిభక్తులు సహాయ సహకారాలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత సత్యసాయికి దక్కుతుంది. ఒక వ్యక్తిగా జన్మించి అవదూతగా అవతరించి లోక కల్యాణార్థం నిత్య సాధన చేస్తున్న సత్యసాయి తన 96వ యేట సజీవ సమాధి అవుతానని అప్పట్లో ప్రకటించారు. 


ఇదీ సత్యసాయి దినచర్య..
ఆధ్యాత్మిక బోధనలతో కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న సత్యసాయిదినచర్య ఆసక్తికరంగా ఉంటుంది. బాబా యజుర్వేద మందిరంలో ఉంటారు. వ్యక్తిగత దినచర్య అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆయన దినచర్య ఇలా...

తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవటం
మూడు నుంచి ఆరు గంటల వరకు ఓంకారం చదువుకోవటం
ఆరు నుంచి ఏడు గంటల వరకు భక్తులు రాసిన ఉత్తరాలను చదవటం
7-8 గంటల మధ్య అల్పాహారం
8-9 గంటల మధ్య భక్తులకు ప్రత్యేక దర్శనం
తొమ్మిది నుంచి 9.30 గంటల మధ్య భజనలో పాల్గొనటం
9.30 గంటలకు యజుర్వేద మందిరానికి చేరుకుని విశ్రాంతి తీసుకోవటం
మధ్యాహ్నం మూడు నుంచి 3.30 గంటల వరకు ప్రశాంతి నిలయంలో భక్తులకు దర్శనం
3.30 నుంచి సాయంత్రం ఐదు వరకు వీఐపీలతో మాట్లాడటం
ఐదు నుంచి 5.30 వరకు ప్రశాంతి నిలయంలో జరిగే భజన కార్యక్రమంలో పాల్గొనటం
5.30 నుంచి ఏడు గంటల వరకు యజుర్వేద మందిరంలో
ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య భోజనం
ఏడున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రస్టు వ్యవహారాలు చూడటం 



ఎనిమిదేళ్లుగా వీల్‌చైర్‌కు పరిమితమైన బాబా 
 
 బెంగుళూరు వైట్‌ఫీల్డ్ ఆశ్రమంలో 2003లో జారిపడి కాలు విరగటంతో అప్పటి నుంచి సత్యసాయి వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. అరుుతే అనతి కాలంలోనే కోలుకుని కొంతకాలం ఆంతరంగికుల సాయంతో నడిచి వచ్చి భక్తులకు దర్శనమిచ్చేవారు. కానీ వయసు రీత్యా శరీరం సహకరించకపోవటంతో వీల్‌చైర్‌లో తన నివాస మందిరం నుంచి సభా మందిరానికి వచ్చి దర్శనమిచ్చేవారు. ట్రస్ట్ వ్యవహారాలను, సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ అనేక ప్రాంతాలలో పర్యటించారు. బాబా వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటి నుంచి పాద నమస్కార భాగ్యానికి భక్తులు దూరమయ్యారు. దూరం నుంచే బాబాను దర్శించుకోవాల్సి వచ్చింది. 

మార్చి 28 నుంచి ఏప్రిల్ 24 దాకా...
 నవంబర్ 23న 85వ జన్మదినోత్సవాన్ని పూర్తిచేసుకున్న బాబా ఆ తరువాత కొద్ది రోజులకు స్లోయింగ్ ఆఫ్ ది హార్ట్ బీట్(హృదయ స్పందన నెమ్మదించడం) సమస్యతో బాధపడుతుండడాన్ని డాక్టర్లు గుర్తించారు. నాలుగు రోజుల పాటు ఆయన నివాస మందిరమైన యజుర్వేద మందిరంలోనే చికిత్స చేశారు. అయినా బాబా ఆరోగ్య పరిస్థితిలో మార్పులేకపోవడంతో మార్చి 28న సిమ్స్(శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్) ఆస్పత్రికి తరలించారు. సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఏఎన్ సఫాయా ఆధ్వర్యంలో చికిత్సలు అందించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమమిదీ...

మార్చి 28: బాబా హృదయ స్పందనలో హెచ్చుతగ్గులున్నట్లు, న్యుమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. పేస్‌మేకర్, వెంటిలేటర్ అమర్చారు.

ఏప్రిల్ 4: మూత్రపిండం పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. రక్తపోటు కూడా సక్రమంగా లేదని గుర్తించారు. దాంతో బాబా ఆరోగ్యం విషమించిందని సిమ్స్ డెరైక్టర్ ఏఎన్ సఫాయా ప్రకటించారు.
ఏప్రిల్ 6: పేస్‌మేకర్, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తూనే కిడ్నీలకు సీఆర్‌ఆర్‌టీ ద్వారా డయాలసిస్ ప్రక్రియను ప్రారంభించారు.

ఏప్రిల్ 7: బాబాకి కామెర్లు ముదిరినట్లు గుర్తించి, కాలేయానికి ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ప్రకటించారు. కాలేయానికి చికిత్స చేయడం ప్రారంభించారు.
ఏప్రిల్ 8: బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
ఏప్రిల్ 16: ఎంత చికిత్స చేసినా కామెర్లు, జ్వరం తగ్గలేదు. దీనికి తోడు బాబాకు కొత్తగా లోబీపీ ఉన్నట్లు వెల్లడైంది. అదే రోజున చికిత్సకు అవయవాలు సహకరించడం లేదని గుర్తించారు.
ఏప్రిల్ 21: మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్‌తో బాధపడుతున్న బాబా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని సఫాయా ప్రకటించారు.
ఏప్రిల్ 22: స్వామి ఆరోగ్యం పూర్తిగా ఆందోళనకరంగా మారిందని, భగవత్ స్వరూపుడైన బాబా ఆరోగ్యాన్ని ఆయనే రక్షించుకోవాలని, తాము చేసేది మానవ ప్రయత్నం మాత్రమేనని సఫాయా పేర్కొన్నారు.

ఏప్రిల్ 23: ఒక్క గుండె తప్ప ఏ అవయవాలూ పనిచేయడం లేదని వైద్యులు ప్రకటించారు.
ఏప్రిల్ 24: గుండె, శ్వాస వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 7.40 గంటలకు బాబా తుది శ్వాస విడిచారని ఉదయం 10.15 గంటలకు సఫాయా అధికారికంగా ప్రకటించారు.


తొలి విదేశీ భక్తురాలు హిల్డా
 
న్యూయార్క్‌కు చెందిన హిల్డాచాల్ట్రన్ సత్యసాయికి మొట్టమొదటి విదేశీ భక్తురాలు. నూయార్క్‌లో యోగా టీచర్‌గా విధులు నిర్వహించే హిల్డా 1982లో భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో పుట్టపర్తిలోని సత్యసాయి బాబా గురించి ఆమెకు తెలియటంతో మార్చి 18న ప్రశాంతి నిలయానికి వచ్చారు. సాధారణ విజిటర్‌గా వచ్చిన ఆమె బాబాకు భక్తురాలిగా మారారు. ఇప్పుడు ప్రపంచంలోని 223 దేశాల్లో మహిళా భక్తులు ఉన్నారు.

మహిళలకు అత్యున్నత గౌరవం

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో విశేష స్థానమున్న మహిళలకు సత్యసాయి సన్నిధిలో అంతే సముచిత గౌరవం దక్కుతోంది. ఏటా జరిగే సత్యసాయి బాబా జన్మదినోత్సవ కార్యక్రమాల్లో ‘మహిళా దినోత్సవం’ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహిళ విజ్ఞానవంతురాలైతే సంస్కృతి, సంప్రదాయాలు నిలిచి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే భావన తరచూ బాబా వ్యక్తం చేసేవారు. అందులో భాగంగానే మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో నాటి రాష్టప్రతి వి.వి.గిరి చేతుల మీదుగా మహిళా డిగ్రీ కళాశాలను బాబా ప్రారంభింపజేశారు. హాస్టల్‌ను వి.వి.గిరి సతీమణి సరస్వతి గిరి ప్రారంభించారు. జిల్లాలో మొదటి మహిళా కళాశాలను నెలకొల్పిన ఘనత బాబాకు దక్కుతుంది.

మూడు దశాబ్దాలుగా మహిళా దినోత్సవం

బాబా జన్మదినోత్సవం సందర్భంగా మూడు దశాబ్దాలుగా మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని సాయి భక్తులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన మహిళలు ఏటా నవంబర్ 19న మహిళా దినోత్సవానికి హాజరవుతుంటారు. మహిళా దినోత్సవంలో అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించటం విశేషం. సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు విన టానికి హాజరయ్యే మహిళలకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ప్రశాంతి నిలయంలోని అన్ని విభాగాల్లో కూడా మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. బాబా 85వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మహిళా దినోత్సవంలో (2010) భారత రాష్టప్రతి ప్రతిభాపాటిల్ పాల్గొన్నారు.

2004లో ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ప్రాజెక్టు

సత్యసాయి మాతృమూర్తి పేరుతో ‘ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ప్రాజెక్టు’ను 2004లో బాబా ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ‘శ్రీ సత్యసాయి ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్టు’గా మార్చారు. ఇది 2005 ఫిబ్రవరి 18 నుంచి సేవలు అందించసాగింది. ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణ మహిళలకు విద్య, ఉపాధి, వైద్య సహాయ కార్యక్రమాలు, తల్లీ పిల్లల వైద్య శిబిరాలు, చేతి వృత్తుల్లో శిక్షణ అందజేస్తున్నారు.


తల్లికిచ్చిన మాట కోసమే.. పుట్టపర్తిని వీడలేదు 


 పుట్టపర్తి.. ఒకప్పుడు మారుమూలగ్రామం.. నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం.. దీనంతటికీ కారణం సత్యసాయి.. మాతృమూర్తికి ఇచ్చిన మాట కోసమే ఆయన పుట్టపర్తిని వీడి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఆయన 2002 ఆగస్టు 31న పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ సభామందిరంలో భక్తులకు వివరించారు.పుట్టపర్తి మారుమూల పల్లెగా ఉన్న కాలంలోనూ తన ఆధ్యాత్మిక సందేశాన్ని అక్కడి నుంచే ప్రపంచానికి విన్పించారు. ఒక రోజున సాకమ్మ అనే భక్తురాలు ‘స్వామీ ఈ పల్లెకు వచ్చిపోవాలంటే మాకు కష్టంగా ఉంది. ఇక్కడికి కార్లు రావడానికి వీల్లేదు. ఎడ్లబండి మీద రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మీరు బెంగళూరు వచ్చేయండి. అక్కడ మీకు గొప్ప భవనం కట్టిస్తాము’ అని వేడుకొంది. బాబా స్పందిస్తూ ‘అక్కడ గొప్ప భవనాలు నాకు అక్కర్లేదు. ఇక్కడున్న చిన్న గది చాలు’ అని సెలవిచ్చారు. ఆయినా ఆ భక్తురాలు పట్టువీడలేదు. అప్పుడు స్వామి మాతృమూర్తి ఈశ్వరమ్మ జోక్యం చేసుకుంటూ ‘మొక్క ఎక్కడ పుట్టిందో అక్కడే దానికి పాదుకట్టి, ఎరువు వేసి, నీరు పోసి పెంచాలి. అప్పుడే అది గొప్ప వృక్షంగా తయారవుతుంది. దాన్ని కొంతకాలం ఒక చోట ఉంచడం, తర్వాత పెరికివేసి ఇంకొకచోట పాతిపెట్టడం...ఈ రీతిగా చేస్తూ ఉంటే అది ఎలా వృద్ధికి రాగలదు? కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి’ అంటూ బాబాను కోరింది. దీంతో పుట్టపర్తిని వదిలి పెట్టనని, భక్తుల దగ్గరకు వెళ్లి వస్తుంటానని బాబా తన మాతృమూర్తికి వాగ్దానం చేశారు.
1926 - 2011


1926: నవంబరు 23న అనంతపురం జిల్లా గొల్లపల్లిలో సత్యసాయి జననం
1936: తన 10వ ఏటనే ‘బంధారి భజన సమాజం’ స్థాపించి ‘సత్య’ పేరుతో భజన పాటలు పాడేవారు.
1938: 12 ఏళ్ల వయసులో ‘చెప్పినాడు క్షేత్ర’ నాటికను స్వయంగా రాసి సాయి దర్శకత్వం వహించి, నటించారు.
1940: 14 ఏళ్ల వయసులో అక్టోబర్ 20న ఉరవకొండలో సత్యనారాయణరాజు అన్న తన పేరు మార్చుకుని ‘సత్యసాయి’ అవతారమని ప్రకటించుకున్నారు. అవతారమూర్తిగా ప్రకటన చేసిన తర్వాత ‘మానస భజరే గురుచరణమ్’ అనే భజన గీతాన్ని స్వామి ఆలపించి తొలి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.

1946: ఊటీ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో సాయి పర్యటించిన సమయంలో ముస్లింలు బాబా ప్రసంగాలకు ఆకర్షితులై భక్తులుగా మారారు.
1947: అక్టోబరు 25న తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు.
1948: అర్జెంటైనాకు చెందిన వ్యక్తి తొలి విదేశీ భక్తుడు. ఈ ఏడాదిలోనే లాటిన్ అమెరికాలో ప్రచారం. ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధానిగా గుర్తింపు పొందిన ప్రశాంతి నిలయానికి శంకుస్థాపన.
1950: నవంబర్ 23న బాబా 25వ జన్మదినోత్సం సందర్భంగా ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం.
1957: వెంకటగిరిలో సాయి భక్తులు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి చేసిన ప్రసంగం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టింది. అప్పటి వరకు బ్రిటిష్ పాలనలో అస్తవ్యస్తమైన భారతీయ సంస్కృతిని సరిదిద్దుకునేందుకు సాయి చేసిన ప్రసంగాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

1958: సత్యసాయి ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు తెలియచేసే ప్రేమవాహిని, ధర్మవాహిని, ధ్యానవాహిని, సందేహ నివారిణి పేరుతో ‘సనాతన సారథి’ పుస్తకాన్ని అనేక భాషల్లో ముద్రించటం ప్రారంభించారు. తెలుగు, మళయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, అస్సామీ, సింధీ, నేపాలీ, ఆంగ్ల భాషల్లో సాయి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

1960: ప్రొఫెసర్ కస్తూరి రాసిన సత్యసాయి జీవిత చరిత్ర మొదటి భాగం విడుదల చేశారు. తర్వాత మూడు భాగాలు విడుదలయ్యాయి.
1961: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ‘సనాతన ధర్మ సూత్రాల’ను బాబా భక్తులకు విశదపరిచారు.
1962: పనామా నుంచి తొలి విదేశీ ప్రయాణానికి సత్యసాయి శ్రీకారం చుట్టారు.
1963: జపాన్ నుంచి ‘రామ్‌చంద్ కుగని’ అనే వ్యక్తి ప్రశాంతి నిలయానికి వచ్చి సాయి భక్తుడిగా మారారు.
1964: సత్యసాయి చైనా పర్యటనలో ఆస్ట్రేలియాకు చెందిన ‘కోవర్ట్ ముర్బట్’ సాయి భక్తుడిగా మారారు. ఆయన 1971లో ‘బాబా అద్భుతాలు’ అనే పుస్తకాన్ని రచించారు.
1965: అమెరికాకు చెందిన డాక్టర్ జాన్ ‘సాయి మిషన్’ను ప్రారంభించారు.

1966: సోషల్ వర్కర్ ఓబెల్‌మెహ్రే ముఖ్య అతిథిగా సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రారంభమైంది. రష్యాకు చెందిన ఇంద్రాదేవి అమెరికాలో నివసిస్తున్న యోగా గురువు. ఆమె సాయి సేవా కార్యక్రమాలకు ముగ్ధురాలై భక్తురాలిగా మారారు. నార్వేకు చెందిన జోగాన్‌సన్ అనే వ్యక్తి బాబాను ముంబైలో కలిసి సాయి ప్రచారకుడిగా మారారు.
1967: ఏప్రిల్ 20, 21 తేదీల్లో సాయి ఆర్గనైజేషన్స్ సమావేశం చెన్నైలో జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని సాయి ఆర్గనైజేషన్ సభ్యులతోపాటు హాంకాంగ్, చైనా, జపాన్, శ్రీలంక, నార్వే దేశాల భక్తులు పాల్గొన్నారు.
1968: ముంబైలో ‘ధర్మక్షేత్ర’ పేరుతో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక, సింగపూర్, మనీలా, కువైట్, దుబాయ్, నైరోబి, ఫిజీ, వెస్టిండీస్, పెరూ, బ్రెజిల్ దేశాలకు చెందిన సాయి భక్తులు పాల్గొన్నారు. జూన్ 30న దక్షిణాఫ్రికాకు చెందిన ‘ఫ్లోరెన్’ సాయి భక్తుడిగా మారారు.
1969: గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సనాతన ధర్మాలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి సత్యసాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. స్థానిక పత్రిక ‘నవకాల్’ బాబా ప్రసంగాలు, సేవల గురించి ప్రచురించిన వ్యాసాలు ఎంతోమంది మంది భక్తులకు మార్గదర్శకంగా నిలిచాయి.

1970: సాయి ప్రసంగాలు, భజనలు, బోధనలు పుస్తకాల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగింది.
1971: హేవార్డ్ అనే సాయి భక్తుడు ‘ది మెన్ మిరాకిల్’ పేరుతో రాసిన పుస్తకాన్ని లండన్‌లో విడుదల చేశారు. మొత్తం నాలుగు భాగాలుగా ప్రచురితమైంది. అమెరికా సినీ దర్శకుడు, రచయిత ఆర్నాల్డ్‌సూల్మిన్ ‘బాబా’ పేరుతో రాసిన పుస్తకాన్ని న్యూయార్క్‌లో విడుదల చేశారు. కాలిఫోర్నియాలో ‘సాయి ప్రచురణ, విక్రయ కేంద్రం’ ప్రారంభించారు.
1972: హాంకాంగ్‌లో సాయి ప్రచార ఆర్గనైజేషన్ పేరుతో శాస్ర్తి అనే భక్తుడు సంస్థను ప్రారంభించి పేదలకు ఆహారం, గూడు కల్పించసాగారు.

1973: మెక్సికో నుంచి లూయిస్ మునిచ్ సతీసమేతంగా ప్రశాంతి నిలయానికి వచ్చి బాబా ఆశీస్సులు పొంది మెక్సికోలో సాయి కేంద్రాన్ని ప్రారంభించారు.
1974: అమెరికాలో జాన్ ఇస్లాబ్ అనే భక్తుడు సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు. బాబా ప్రసంగాలను అర్లెటీ అనే భక్తుడు స్పానిష్ భాషలోకి అనువదించి వెనిజులాలో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభించారు.
1975: జపాన్, ఇండోనేషియాల్లో హిరుబర్వాని అనే భక్తుడు సాయి కేంద్రాలను ప్రారంభించారు. డాక్టర్ ఆలీ హుస్సేన్ స్విట్జర్లాండ్‌లో సెంటర్‌ను ప్రారంభించగా, ఆస్ట్రేలియా, జర్మనీలో కూడా ఇదే ఏడాది పారంభమయ్యాయి.

1979: పెరూలో బ్రైటో దంపతులు శాంతినిలయాన్ని ప్రారంభించారు.
1980: గురుపౌర్ణమి సందర్భంగా ఆస్ట్రేలియాలోని స్టాక్‌ఫీల్డ్‌లో సాయి కేంద్రం ప్రారంభించారు. అర్జెంటైనా, చిలీ, తైవాన్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
1983: ఏప్రిల్‌లో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించారు. ఇందూలాల్ షా ఆస్ట్రేలియాలో సెంటర్‌ను ప్రారంభించారు. 1985: బ్యాంకాక్‌లో సత్యసాయి ట్రస్ట్, చార్లెస్ బిన్ రాసిన ‘సాయిరాం’ పుస్తకం, జాన్ హిల్స్ లాఫ్ రాసిన ‘బాబా - నేను’ అనే పుస్తకం, సామ్‌వెల్ రాసిన ‘స్పిరిచ్యువల్ మైండ్’, క్రిస్టిల్ రాసిన సాయిబాబా అనుభవాలు అనే పుస్తకాలు ముద్రించారు.
1987: బ్రెజిల్‌లో సాయి ఆర్గనైజేషన్ ప్రారంభమైంది.
1988: ఉరుగ్వేలో సాయి ఆర్గనైజేషన్‌తోపాటు వృద్ధాశ్రమం, విద్యాసంస్థ, పేదలకు ఆహారం అందచేసే సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి.

1991: ఆస్ట్రియాలో సత్యసాయి సెంటర్‌ను ఏర్పాటు చేసి యూరోపియన్ హెల్పింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించారు.
1992: బ్రెజిల్‌లో నలుగురు విద్యార్థులతో సాయి విద్యాసంస్థ ప్రారంభమైంది.
1995: సత్యసాయి బోధనలు వినేందుకు 20,000 మంది ఒకేసారి కూర్చునే విధంగా ‘సాయి కుల్వంత్ హాల్’ను ప్రశాంతి నిలయంలో ప్రారంభించారు.
1999: ఢిల్లీలో సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభమైంది.
2001: ప్రశాంతి నిలయంలో సాయి పబ్లిషింగ్ డివిజన్ ఏర్పాటు, సాయి రేడియో ప్రారంభమైంది.
2005: నవంబర్‌లో సత్యసాయి విద్యార్థుల ప్రపంచ మహాసభ జరిగింది.
2006: నవంబర్‌లో అంతర్జాతీయ సత్యసాయి ట్రస్ట్ ప్రారంభం
2007: సాయి ప్రేమ పేరుతో 85 దేశాలకు చెందిన 66 వేల మంది యువతీయువకులు ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
2009: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ ప్రారంభించారు.
2010: నవంబర్‌లో పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి 85వ జన్మదినోత్సవ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన అతిథులు, రాష్టప్రతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు ఎందరో హాజరయ్యారు.
2011: మార్చి 28న అనారోగ్యానికి గురైన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లో చేరారు. ఏప్రిల్ 24న పరమపదించారు.
 

ప్రేమ-సేవ.. మానవసేవే- మాధవ సేవ.. ఈ రెండు బోధనలతోనే కోట్లాది మంది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సత్యసాయిబాబా ప్రపంచవ్యాప్తంగా ‘ఓం సాయిరాం’ నామాన్ని ప్రతి ఒక్కరూ జపించేలా చేశారు. అనంతపురం జిల్లా గొల్లపల్లిలో రత్నాకరం సత్యనారాయణరాజుగా 1926 నవంబర్ 23న జన్మించారు. 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో ‘శ్రీ సత్యసాయి’ అవతార ప్రకటనతో కలియుగ ఆధ్యాత్మిక దైవంగా భాసిల్లుతున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రశాంతి నిలయాన్ని కేంద్రంగా రూపొందించి గొల్లపల్లి గ్రామానికిపుట్టపర్తిగా ప్రపంచదేశాల్లో గుర్తింపు తెచ్చారు. ప్రశాంతి నిలయం ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ‘సత్యసాయి ట్రస్ట్’ పేరుతో విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సాయి భక్తులు ఉన్నారు. ప్రతి రాష్ట్రం, జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల పేరుతో అనేక రకాల సేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా సత్యసాయి బాబా ప్రవచనాలను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది సాయి భక్తులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సాయి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు ఖండాల ప్రజలను ఒక్కచోట చూసే అవకాశం సత్యసాయి వల్ల రాష్ట్ర ప్రజలకు దక్కింది.


ప్రపంచ వ్యాప్తంగా సాయి ఆర్గనైజేషన్స్


భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 223 దేశాలకు చెందిన ప్రజలు, ఆయా దేశాల అధినేతల నుంచి సేవలు అందుకున్న ఘనత సత్యసాయికి దక్కింది. అమెరికా, ఇజ్రాయెల్, వెస్టిండీస్, బార్బడోస్ అండ్ కరేబియన్ దీవులు, కెనడా, బెల్జియం, క్యూబా, ఎల్‌సాల్వెడార్, గ్వాటెమాలా, ఫ్రెంచి గయానా, మెక్సికో, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే, ఉరుగ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఫసిఫిక్ ఐలాండ్, ఫిలిప్పీన్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, థాయిలాండ్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్, చైనా, హాంకాంగ్, జపాన్, కొరియా, తైవాన్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బోస్నియా, బల్గేరియా, గ్రీస్, రొమేనియా, సెర్బియా, అస్ట్రియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, హంగరీ, స్లొవేకియా, బెల్జియం, డెన్మార్క్, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఎస్టోనియా, ఫిన్లండ్, లాట్వివా, లిథువేనియా, పోలండ్, అజర్‌బైజాన్, అర్మేనియా, జార్జియా, కజకిస్థాన్, మాల్దోవా, రష్యా, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఉక్రెయిన్, ఇంగ్లండ్, ఐర్లండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, లిబియా, సోమాలియా, స్వాజిలాండ్, టాంజానియా, ఉగండా, జాంబియా, జింబాబ్వే, అబుదాబీ, దుబాయి, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, సెర్బియా, అల్బేనియా, సైప్రస్, అమెరికా తదితర దేశాల్లో సాయి సేవలు కొనసాగుతున్నాయి.


ప్రపంచంలోని సేవా సంస్థల సేవలు


సత్యసాయి బాబా స్పిరుచ్యువల్ ఆఫ్ కెనడా పేరుతో కొన్ని దేశాల్లో, యూరప్ ఖండంలోని 50 దేశాల్లో, అమెరికాలో యూఎస్ సాయి ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సాయి ఆర్గనైజేషన్, యూఎస్ సాయి సెంటర్ రిసోర్సెస్, యూఎస్‌ఏ డివోషన్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, సర్వీస్ వింగ్, యంగ్ అడల్ట్స్, సాయి బుక్ సెంటర్ కేంద్రాలు యూఎస్‌ఏ సాయి ఆర్గనైజేషన్ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈ సంస్థ 66 దేశాల్లో సేవలు అందిస్తోంది.












No comments:

Post a Comment