భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Friday, April 22, 2011

సర్వం మాయ! పుట్టపర్తిలో మహా మిస్టరీ

ఒక వైపు బాబాకు చికిత్స మరో వైపు పోలీసు బ్యాండ్ రాక

భారీ స్క్రీన్లు ,జనరేర్లూ సిద్ధం
ప్రముఖుల కోసం హెలిప్యాడ్ల ఏర్పాటు
పెద్దఎత్తున బలగాలు మోహరింపు
భక్తుల్ని తికమక పెడుతున్న చర్చలు
అంతర్జాతీయ ఆర్ధిక లావాదేవీలు చక్క బెట్టుకునేందుకేనా?
ఏ మాత్రం మార్పు లేదు
బాబా ఆరోగ్యంపై సఫాయా
 
సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా ప్రకటించారు. బాబా ఆరోగ్యంపై ఆయన శుక్రవారం ఉదయం, సాయంత్రం బులెటిన్లు విడుదల చేశారు. ఉదయం ఉన్న విషమ పరిస్థితే సాయంత్రం కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. రక్తపోటు, హృదయ స్పందన నిలకడగా ఉన్నాయని, అవి అలాగే కొనసాగేందుకు మందులు అందిస్తున్నామని తెలిపారు. వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తూ మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడానికి సీఆర్ఆర్ థెరపీని కొనసాగిస్తున్నామన్నారు.

అసలు పుట్టపర్తిలో ఏం జరుగుతోంది? బాబాకు ఓ వైపు చికిత్స నడుస్తోంది. మరోవైపు పోలీసు బ్యాండ్ పార్టీ పుట్టపర్తిలో వచ్చి వాలింది. ఎక్కడెక్కడి నుంచో భారీ స్క్రీన్లు తెప్పించారు. అదనపు డీజీపీ స్థాయి అధికారిని అక్కడ మోహరించి ఆరేడు వేల మంది పోలీసులను తరలించారు. ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లు సిద్ధమవుతున్నాయి. ట్రస్టు సభ్యులు హడావుడిగా మంతనాలు జరుపుతున్నారు. బాబాకు ఒకవైపు చికిత్స జరుగుతుండగానే ఈ హడావుడంతా ఏమిటి? సత్యసాయి ట్రస్టుకు అనేక దేశాల్లో డబ్బు లావాదేవీలున్నాయని, ముందుగా వాటిని చక్కబెట్టుకునే ప్రయత్నాల్లోనే ఈ వింతలన్నీ జరుగుతున్నాయన్నది విశ్వసనీయ సమాచారం.

పుట్టపర్తిలో హైడ్రామా నడుస్తోంది. మానవ మాత్రుల ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సత్యసాయి బాబా ఆరోగ్యంలో ఒడి దుడుకులు, ఉద్విగ్న వాతావరణం సహజమే! ఒకసారి ఉన్న పరిస్థితి మరికాసేపటికి మారిపోవచ్చు. కాస్త కుదుట పడినట్లే పడి అంతలోనే ముప్పు ముంచుకురావచ్చు.. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చు.

అనుభవజ్ఞులైన వైద్యులకు ఇదేమంత విశేషం అనిపించదు కానీ, ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తే మాత్రం అసలేం జరుగుతోందన్న ప్రశ్న అటు భక్త జనంలోనూ, ఇటు సాధారణ ప్రజల్లోనూ కలుగుతోంది. మార్చి 28న బాబాను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పటికి, ఇప్పటికి ఆరోగ్యంలో మాత్రం మార్పులేదు. ఇన్‌ఫెక్షన్ తగ్గి ఉండవచ్చు కానీ, ఇతరత్రా మెరుగుదల ఏమాత్రం లేదు. ఆరోగ్యస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఏ విషయాన్ని తేల్చి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.

అయితే హృదయ స్పందన పూర్తిగా నిలిచిపోయి, ఇక పునరుద్ధరణ సాధ్యం కాదని నిర్ధారణ అయితే వెంటిలేటర్ తొలగించడం చివరి అంకం అవుతుంది. బాబా శ్వాస ఆగిపోలేదని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది గత 25 రోజులుగా ఉన్న పరిస్థితి. మీడియా హడావుడి చేస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తోందని కొందరు ట్రస్టు సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ, అసలు వారు చేస్తున్నదేమిటి, ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అది చూసిన వారికెవరికైనా అనేక అనుమానాలు తలెత్తక మానవు.

బాబా ఆరోగ్యం వైద్యుల చేతుల్లో ఉంది. అయితే ఆయనకు చికిత్స జరుగుతుండగానే ట్రస్టు సభ్యులు హడావుడిగా సమాలోచనలు ఎందుకు జరిపారు? మిగతా సభ్యులతో మంతనాలు ఎందుకు చేశారు? అంతా సవ్యంగానే ఉంటే పుట్టపర్తిని పోలీసుమయం ఎందుకు చేశారు? అదనపు డీజీపీ స్థాయి అధికారిని అక్కడకు పంపి ఆరేడు వేల మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో బిగ్ స్క్రీన్లు ఎందుకు తెప్పించారు? పోలీసు బ్యాండ్ పార్టీ ముందుగానే ఎందుకు దిగింది?

ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్లు ఎందుకు సిద్ధం చేస్తున్నారు? పోనీ, ఆరోగ్యం విషమించి ఏ క్షణం ఏమైనా జరగవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా ఇవన్నీ తెచ్చారనుకున్నా... అంతటి అత్యున్నత స్థాయి వ్యక్తి విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవచ్చా? ప్రాణాలతో పరాచికాలా? పోనీ బాబా దేహాన్ని వీడిపోతే అప్పటికప్పుడు భారీ భద్రతా ఏర్పాట్లు సాధ్యం కావన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనే వాదన ప్రకారం చూసినా... అదే జరిగిందని వైద్యులు నిర్ధారించాక, బయటకు ప్రకటించకుండా అన్ని ఏర్పాట్లూ చేసి తర్వాత ప్రకటించవచ్చు.

ఇప్పుడు చేస్తున్నది అదే అనుకుందామంటే.... గత రెండు రోజుల నుంచీ ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మరి రెండు రోజుల వ్యవధి తీసుకొని కూడా అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? వైద్యులు చెబుతున్నట్లు ఆయన హృదయం, మెదడు స్పందిస్తోంటే ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారనుకోవాలి? అని భక్త జనం నుంచి ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అయితే సత్యసాయి ట్రస్టుకు సంబంధించి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న నిధుల వ్యవహారాలను ముందుగా చక్కబెట్టుకోవడం కోసమే ఈ తతంగమంతా నడిపిస్తున్నారన్నది ఓ సమాచారం. ఆ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో కీలక ప్రకటనను నెట్టుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాలూ బందీయేనా?

ట్రస్టు చేతుల్లో బాబాయే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బందీగా మారాయా? ఏది చేయాలన్నా ట్రస్టు సలహాల మేరకే నడుచుకుంటున్నాయా? వారు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనిదే అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయా? అనే సందేహాలు ముసురుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇతర చోట్ల చిన్న చిన్న ఆరోపణలపై కూడా ప్రభుత్వం సూమోటో కేసులు కట్టి విచారించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే పుట్టపర్తిలోని పరిణామాలపై కేంద్ర, రాష్ట్రాలు చేతులు కట్టుకుని కూర్చోవడం అనుమానాలకు తావిస్తోంది. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ట్రస్టులో అనేక వ్యవహారాలు నడుస్తున్నట్లు భక్తుల నుంచి, కొందరు ప్రముఖుల నుంచి, కొందరు నాయకుల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా కొన్ని ఆరోపణల్ని «ద్రువీకరిస్తున్నాయి. కానీ ప్రభుత్వ స్థాయిలో మాత్రం ఎలాంటి కదలికలు లేవు. ఆస్తులు తరలుతున్నా, పంపకాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.

బాబా ఆరోగ్యంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచీ ఆయనకు చికిత్స చేసి ఉంటే ఇప్పుడీ స్థితి వచ్చేది కాదని ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సత్యసాయి ఆరోగ్యం క్షీణిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీడియా కట్టడికి యత్నాలు

బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతోపాటు శుక్రవారం ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. దీంతో బాబా భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బయటివారెవర్నీ ఆ ఛాయలకు కూడా వెళ్లనివ్వని ట్రస్టు సభ్యులు... సత్యసాయి బాబా ఆరోగ్యం గత రెండురోజులుగా తీవ్ర ఆందోళనకర స్థితికి చేరుకోవడంతో పంథా మార్చారు. అధికారులతోను, ప్రజా ప్రతినిధులతోను సమావేశాలు జరుపుతున్నారు. బాబా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే, ఈ చివరి దశలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రస్టు వర్గాలు ప్రధానంగా అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి ద్వారా మీడియాను కట్టడి చేసేందుకు పావులు కదిపినట్లు తెలిసింది. పుట్టపర్తిలో జరుగుతున్న వ్యవహారాలను, అక్రమాలను మీడియా ప్రజలకు, భక్త జనానికి తెలియజేస్తుండడంతో అది మింగుడుపడని కొందరు పెద్దలు మీడియాను కట్టడి చేసే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఉన్నత స్ధాయి సమీక్ష
బాబా ఆరోగ్యంపై ట్రస్టు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య బృందంతో సమీక్ష జరిగింది. సమీక్షకు మంత్రి గీతారెడ్డి, డాక్టర్ సఫాయా, ప్రభుత్వ వైద్య నిపుణుడు డాక్టర్ రవిరాజా, అదనపు డీఐజీ రతన్, ఐజీ సంతోష్ మెహ్రా, అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్దన్‌రెడ్డి, డీఐజీ చారుసిన్హా, ట్రస్టు సభ్యులు రత్నాకర్, నాగానంద, గిరి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. పుట్టపర్తికి బిగ్‌స్క్రీన్లు, జనరేటర్లు, పోలీసు బ్యాండ్ బృందాలను రప్పిస్తున్న విషయమై నిమ్మల,పల్లె రఘునాథరెడ్డిలను ప్రశ్నించగా... ఆ విషయం తమకు తెలియదని, సమావేశంలో అవేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు.

No comments:

Post a Comment