భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Saturday, April 23, 2011

* మనుషులు చేసిన దేవుళ్లు - ఆదిత్య


 
దేవుడిని నమ్ముకోవాలా? అమ్ముకోవాలా? ఎవరైనా నమ్ముకోవాలనే చెబుతారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. బాబాలే కాదు.. దేవుళ్లు కూడా ప్రచారాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితులు! 'గాడ్' వేరు. 'గాడ్ మ్యాన్' వేరు. ఒక నమ్మకం.. ఒక బలహీనత.. ఒక నిస్సహాయత.. వెరసి గాడ్‌ను మించిన గాడ్ మ్యాన్లు పుట్టుకు వస్తున్నారు.

గాడ్ మ్యాన్‌ని 'చిత్రపు స్వామి' అని కూడా పిలుచుకోవచ్చు. "సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటారు. కానీ, కొందరు చిత్రపు స్వాములు మాత్రం దేవుళ్లుగానే చలామణి అవుతున్నారు. వాస్తవానికి, ఈ చిత్రపు స్వాములకు తాము దైవం కంటే అధికమన్న భావన ఉండదు. కానీ, వారి చుట్టూ చేరే కొంతమంది భక్త (భజన) బృందం మాత్రం వారిని దైవంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. దీనితో ఆయా వ్యక్తులు గాడ్‌గా చలామణి అవుతూ ఉంటారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఇందులో ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఒక వ్యక్తి కొన్ని మహిమలు లేదా తాంత్రిక విద్యలు నేర్చుకున్నారనుకుందాం. తనను గురించి తానే ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఉండదు కనుక, కొంత మంది శిష్య బృందాన్ని పోగేసుకుంటారు. ఈ శిష్య బృందం సదరు వ్యక్తిని గాడ్ మ్యాన్‌గా ప్రచారం చేయడం ప్రారంభిస్తుంది. దీనితో ఒక గాడ్ మ్యాన్ అవతరిస్తాడు. ఈ దశ వరకు గాడ్ మ్యాన్‌కు శిష్యులు ఉపయోగపడతారు.

ఆ తరువాత దశలో సదరు గాడ్ మ్యాన్‌ను శిష్యులు ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. అంటే, ఉభయ కుశలోపరి సిద్ధాంతాన్ని ఆచరిస్తారన్న మాట! అయితే, గాడ్ మ్యాన్ పాపులర్ అయిన తర్వాత అసలు చిక్కు మొదలవుతుంది. గాడ్ మ్యాన్ క్రమంగా తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. కోటరీగా ఏర్పడే భక్త బృందం చేతిలో బందీగా మారతాడు. గాడ్ మ్యాన్‌కు ఎన్ని మహిమలు ఉన్నా, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి.

ఈ బలహీనతలనే కోటరీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకుని గాడ్ మ్యాన్‌ను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. అక్కడ నుంచి గాడ్ మ్యాన్‌ను అమ్ముకోవడం ప్రారంభిస్తారు. ఈ లోపు ఏ ప్రయోజనాలనూ ఆశించని అమాయక భక్తులు కూడా తయారవుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రయోజనం పొందేది మాత్రం, గాడ్ మ్యాన్‌తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రమే.

పుట్టపర్తిలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వెలుగొందిన సత్యనారాయణ రాజు అలియాస్ సత్యసాయి బాబాను గాడ్ మ్యాన్ అంటే భక్తులు ఒప్పుకోకపోవచ్చు. కానీ, గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి కచ్చితంగా తేడా ఉంటుంది. సాయిబాబా విషయమైనా అంతే! ఎందుకంటే, సాయిబాబానే స్వయంగా కలియుగ దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారు. అంటే, తాను దేవుడిని కానని బాబాకు తెలుసు.

తాను సామాన్యుడినని బాబానే స్వయం గా ఒక సందర్భంలో ప్రకటించుకున్నారు. అయినా, తెలియనట్టు నటిస్తున్నది ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ సభ్యులే! అందుకే, అనారోగ్యంతో చివరి క్షణాలు గడుపుతున్న బాబాకు ఏమీ కాదని, ఆయన మరింత కాలం జీవిస్తారని భక్తులు విశ్వసించేటట్లు చేస్తున్నారు. బాబా దేవుడే అయితే ఈ అవతారాన్ని ఫలానా రోజు చాలిస్తున్నట్లు ముందుగానే ప్రకటించి ఉండవచ్చు. కానీ, అలా జరగలేదు కనుక ఆయన్ని గాడ్ మ్యాన్‌గానే పరిగణించవలసి ఉంటుంది.

బాబా కోరుకుంటే తనంతట తాను స్వస్థత చేకూర్చుకోగలరని రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి వి.అప్పారావు వంటి వాళ్లు వ్యాఖ్యానించ డం లేదా విశ్వసించడం విడ్డూరంగా ఉంది. పోలీసు శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన అప్పారావు వంటి వాళ్లు హేతుబద్ధత లేని వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు.

వాళ్లంతా తమకు బాబా వల్ల మేలు జరిగిందని చెబుతూ ఉంటారు. మేలు జరగకపోతే బహు శా వాళ్లు కూడా బాబాను భగవాన్‌గా సంబోధించే వారు కాదేమో! తన వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలన్నీ, చేతికి ఉన్న వాచీతో సహా బాబా ఇచ్చినవేనని అప్పారావు చెప్పుకొన్నారు. వాస్తవానికి సత్య సాయిబాబా జీవితంతోపాటు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఎన్నో వివాదాలమయం.

తన ట్రస్టుకు సమకూరుతున్న విరాళాల నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మొదలైన తర్వాతే బాబాకు విమర్శకులు తగ్గి, అన్ని వర్గా ల ప్రజలలో గౌరవం పెరిగింది. అయితే, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, అధికారులు, రాజకీయ ప్రముఖులు మాత్రమే బాబాకు సన్నిహితంగా మెలగగలిగారు. ఇలా బాబాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదో ఒక ప్రయోజనం చేకూరిన సందర్భాలు ఎన్నో ఉన్నా యి. అలా అని ఆయనను నిజంగా నమ్మిన నిస్వార్థ భక్తులు ఎవరూ లేరని చెప్పడం లేదు.

బాబా కూడా తనకు సన్నిహితమైన ప్రముఖ భక్తులకు ఏదో ఒక మేలు చేయడానికి ఎన్నడూ వెనుకాడలేదు. ఉదాహరణ కు బాబాకు పరమ భక్తుడైన రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి హెచ్.జె.దొర డి.జి.పి.గా నియమితులు కావడం వెనుక బాబా పాత్ర ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సం ఘటన జరిగింది. దొర జూనియర్ అయినందున సీనియర్ అధికారిని డి.జి.పి.గా నియమించాలని నిర్ణయించడం జరిగింది.

కానీ, తెల్లారేలోపు చంద్రబాబు నిర్ణయం మారిపోయిం ది. బాబా నుంచి వచ్చిన ఫోన్‌కాల్ వల్ల జూనియర్ అయినప్పటికీ దొరను డి.జి.పి.గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే, బాబా సామాన్య భక్తుల విషయంలో ఒకలా, ప్రముఖుల విషయంలో మరోలా వ్యవహరించేవారు.

సామాన్య భక్తులు దర్శనానికి వస్తే విభూతి ఇచ్చి సరిపెట్టేవారు. అదే మంత్రులు లేదా ఉన్నతాధికారులు లేదా పౌర ప్రముఖులు వెళితే బంగారపు ఉంగరాలు, గొలుసులు లేదా రిస్ట్ వాచీలు బహూకరించేవారు. అంతేకాదు, ప్రశాంతి నిలయంలో పకడ్బందీ నెట్‌వర్క్ పనిచేస్తూ ఉంటుంది. బాబా దర్శనం కోసం వచ్చేవారి వివరాలు, వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని ఈ నెట్‌వర్క్ బాబాకు చేరవేస్తుంది.

ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. 1994కు ముందు మిత్రుడు ఒకరికి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనను పరామర్శించడానికి నాటి మంత్రి హరిరామ జోగయ్యతో పాటు నేనూ వెళ్లాను. మంత్రి ఆస్పత్రికి వచ్చిన విషయం ఎలా తెలిసిందో గానీ, మేం ఆస్పత్రికి వెళ్లే లోపే మంత్రికి గౌరవ మర్యాదలు చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మా మిత్రుడిని పరామర్శించిన తర్వాత సాయంత్రం అందరితో పాటు మేం కూడా బాబా దర్శనం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చున్నాం.

బాబా వచ్చారు.. వెళ్లారు. కొంతసేపటికి హరిరామ జోగయ్యకు పిలుపు వచ్చింది. ఆయనను మాత్రమే బాబా సందర్శనకు అనుమతించారు. అప్పట్లో నేను విలేకరిని మాత్రమే కనుక నాకు ఆహ్వానం లేదు. బాబా యధావిధిగా జోగయ్యకు నవరత్నాల ఉంగరాన్ని బహూకరించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదనీ, 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలంటూ నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి సూచించవలసిందిగా కోరారు. బాబా రాజకీయాలు మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం జోగయ్య వంతు అయింది. అయి తే, బాబాను చిత్తశుద్ధితో నమ్మేవాళ్లు కూడా అందుకు బలమైన కారణాలనే చెబుతూ ఉంటారు.

నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాన్ని ఈ సందర్భంగా వివరించారు. తన కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో సదరు మిత్రు డు హైదరాబాద్‌లోనే చేర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలోనే తాను బాబా దర్శనానికి వెళ్లాననీ, 'నీ కుమారుడికి మద్రాసులోనే సీటు వస్తుందిలే' అని బాబా అన్నారనీ, అలాగే పదిరోజుల తర్వాత సదరు కళాశాల నుంచి సీటు ఇస్తున్నట్లు కబురు వచ్చిందని ఆ మిత్రుడు వివరించారు. ఇది బాబా మహిమగా ఆయన నమ్ముతున్నారు.

నా మిత్రుడి కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కావాలన్న విషయం ముందుగానే తెలుసుకుని తన పలుకుబడితో ఆ సీటు ఇప్పించి ఉండవచ్చు కూడా! ఏది ఏమైనా ఆ మిత్రుడికి మంచే జరిగింది కనుక, దాని లోతుపాతుల్లోకి ఇప్పుడు వెళ్లడం అనవసరం. సత్య సాయిబాబాను వేలెత్తి చూపడానికో, తప్పు పట్టడానికో ఇవన్నీ చెప్పడం లేదు. ఎవరి నమ్మకం వారిది.

కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే గాడ్‌కి, గాడ్ మ్యాన్‌కి తేడా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. తెలుగుగంగ ప్రాజెక్టు విషయమై నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబాను దర్శనం చేసుకుందామని చంద్రబాబు అనగా, "నేను గాడ్‌ను నమ్ముతానుగానీ, గాడ్‌మెన్‌ను నమ్మను'' అని జయలలిత స్పష్టంగా చెప్పారు.

బాబాకు బంగారం పట్ల ఆసక్తి లేదనీ, బంగారం, నగలు ప్రశాంతి నిలయంలో స్వీకరించరనీ, చెక్కుల రూపంలోనే విరాళాలు స్వీకరిస్తారనీ అప్పారావులాంటి భక్తులు చెబుతున్నారు. కానీ, వాస్తవం అందుకు విరుద్ధం. బాబా నివసించే యజుర్మందిరంలోనే పలు గోడలకు బంగారు రేకులతో తాపడం చేయించారు. అంతెందుకు, 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర రెడ్డి బాబా దర్శనానికై పుట్టపర్తి వెళ్లారు.

అప్పుడు బాబా గదిలో బంగారం బిస్కెట్లు, నగలతో కూడిన పలు మూటలు ఉన్న విషయాన్ని గమనించిన ఒక అధికారి, ముఖ్యమంత్రితో బయటకు వచ్చిన తర్వాత అదే మాట చెప్పారు. "నేనూ చూశాను. అయినా, ఆ విషయాలన్నీ మనకు ఎందుకు?''అని విజయ భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. కాలక్రమంలో బాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆయనకు శాశ్వత కీర్తిని మిగల్చనున్నాయి. ప్రస్తుతం బాబా అనారోగ్యంతో పడుతున్న బాధను చూస్తూ ఉంటే ఆయన సుఖపడింది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. బాబాను గ్లోరిఫై చేయడం కోసమే ఆయన చుట్టూ ఉన్న ట్రస్టు సభ్యులుగానీ, కోటరీ సభ్యులుగానీ బంగారు రథాల వంటివి తయారు చేయించి ఆర్భాటానికి పాల్పడి ఉండవచ్చు.

ఒక్క సత్యసాయి బాబా విషయంలోనే కాదు, పలు ఇతర స్వాముల విషయంలో కూడా ఇలాంటి ఆర్భాటాలను మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతున్న వారుగానీ, మత గురువులు గానీ ఇలాంటి ఆర్భాటాలను స్వయంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్భాటం లేకపోతే తమకు గొప్పవాళ్ళుగా గుర్తింపు రాదని వారు భావిస్తూ ఉండవచ్చు. గణపతి సచ్చిదానంద స్వామినే తీసుకుందాం. ఎవరైనా భక్తుడి ఇంటికి వెళ్ళాలన్నా, కాళ్లు కడిగించుకోవాలన్నా ఆయన డబ్బు తీసుకుంటారు.

ఇక, కల్కి భగవాన్‌గా చలామణి అవుతున్న కల్కి దంపతుల ఆడంబర జీవితం గురించి తెలిసిందే! ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవలసిన స్వాములకు, బాబాలకు డబ్బుతో అవసరం ఏమిటో తెలియదు. స్వార్థాన్ని విడనాడాలనీ, కోర్కెలను త్యజించాలనీ ప్రవచించే స్వాములెందరో విలాసవంతమైన జీవితాలనే గడుపుతూ ఉండటం విశేషం. ఈ క్రమంలో తమను తాము దైవం కంటే అధికమని భావించేవాళ్లు పుట్టుకు వస్తారు లేదా తీర్చిదిద్దబడతారు. అయితే, ఈ స్వాములందరికీ కొంతకాలమే మహర్దశ ఉంటుంది.

సత్యసాయిబాబానే తీసుకుందాం. యువతరం ఎవరూ ఆయనకు భక్తులుగా మారడం లేదు. పాత తరానికి చెందిన వాళ్లే ఆయనకు భక్తులుగా కొనసాగుతున్నారు. అభిరుచులను మార్చుకుంటున్నట్లుగానే దేవుళ్లు, స్వాముల విషయంలో కూడా భక్తుల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇప్పటి తరం వాళ్లు షిరిడీ సాయిబాబాను ఆరాధించడం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం షిరిడీ సాయిబాబాకు అంతగా ఆదరణ ఉండేది కాదు.

సాధారణ మనుషులతోపాటు స్వాములు, బాబాలకే కాదు దేవాలయాలకు కూడా మహర్దశ కొంతకాలం పాటు ఉంటుంది. కొలిచే దేవుడు ఒకరే అయినా ఫలానా దేవాలయానికి వెళితే కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకం వ్యాపించడమే ఇందుకు కారణం. శ్రీ వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. దేవుడన్నాక ఎక్కడైనా దేవుడే కదా! ఇంతకాలం ఆదరణకు నోచుకోని చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిందంటే, దేవాలయాలకు కూడా మహర్దశ అంటూ ఒకటుంటుందని నమ్మాలి.

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ధోరణులు పెరిగిపోయిన ఈ రోజుల్లో గాడ్ అయినా గాడ్ మ్యాన్ అయినా మార్కెటింగ్ టెక్నిక్‌లకు అతీతులు కాదని నమ్మాల్సిందే! ఇదంతా చూస్తూ ఉంటే దేవుడు మనిషిని సృష్టించాడా? మనుషులే దేవుడిని సృష్టించారా? అన్న అనుమానం కలుగకమానదు. దేవుడిని నమ్ముకోకుండా, అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. మనది కర్మభూమి కనుక, తాంత్రికులు దేవుళ్లు అవుతారు. అవినీతిపరులు మహానేతలు, యువనేతలుగా కీర్తించబడతారు. 

- ఆదిత్య

1 comment:

  1. on this earth no human being is GOD ,but some people are considered gods because of their deeds by the ignorant masses.We ,the masses make these people as gods .

    ReplyDelete