భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Sunday, April 24, 2011

జగమంత విషాదం * సత్యసాయి మహాభినిష్ర్కమణం

గుండె, శ్వాస వ్యవస్థల వైఫల్యం కారణంగా కన్నుమూసిన సత్యసాయి
శోకసంద్రంలో భక్త కోటి... కన్నీటిసంద్రమైన ప్రశాంతి నిలయం
నేడు, రేపు సాయి కుల్వంత్ హాల్‌లో భక్తుల సందర్శనకు పార్థివదేహం
పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు.. సేవామూర్తికి కన్నీటి నివాళులు
సత్యసాయికి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్, సీఎం కిరణ్...
రేపు పుట్టపర్తికి రానున్న ప్రధాని మన్మోహన్ సింగ్

ప్రపంచమంతా ప్రేమమయం కావాలని పరితపించిన సత్యసాయిబాబా మహాభినిష్ర్కమణం చేశారు... జగమంతా విషాదంలో మునిగిపోయింది. హృదయ సంబంధ వ్యాధితో పుట్టపర్తిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరి 28 రోజులుగా చికిత్స పొందుతున్న బాబా.. ఆదివారం ఉదయం పరమపదించారు. గుండె, శ్వాస వ్యవస్థలు పనిచేయటం ఆగిపోవడంతో బాబా కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. దీంతో పుట్టపర్తి సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తజనకోటి శోకసంద్రంలో మునిగి పోయింది. బాబా పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆదివారం సాయంత్రం ప్రశాంతి నిలయానికి తరలించారు. సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు భక్తుల సందర్శనకోసం పార్థివదేహాన్ని అక్కడే ఉంచుతారు. బుధవారం ఉదయం అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సత్యసాయి పార్థివదేహాన్ని సందర్శించేందుకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకూ వెల్లువలా తరలివస్తున్నారు.

  ‘ఈ దేహాన్ని ఎన్ని విధాలుగా పోషించినా.. ఏనాడో.. ఏ క్షణానో.. ఎలా పోతుందో.. ఎవరికీ తెలియదు. ఏనాటికైనా మృత్యువు తప్పేది కాదు.. అది సృష్టి ధర్మం కూడా..! అందుకని దేహాభిమానం విడిచిపెట్టాలి. సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి’ అని మానవ జీవిత పరమార్థాన్ని విశ్వానికి చాటిచెప్పిన సామాజిక సేవామూర్తి, అధ్యాత్మిక సూరీడు పుట్టపర్తి సత్యసాయిబాబా సృష్టి ధర్మాన్ని పాటించారు. ఆదివారం ఉదయం 7:40 గంటలకు బాబా తన భౌతికదేహాన్ని వదిలి దివికేగారు. బాబా మహాభినిష్ర్కమణం భక్తకోటిని శోకసంద్రంలో ముంచెత్తింది. భక్తుల రోదనలతో.. ఆర్తనాదాలతో పుట్టపర్తి కన్నీటి సంద్రంగా మారింది. గుండె కొట్టుకోవటం మందగించటం (స్లోయింగ్ ఆఫ్ ది హార్ట్ బీట్) వల్ల బాబాను మార్చి 28న సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు సిమ్స్ (శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్) ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎన్.సఫాయా నేతృత్వంలో 15 మంది సభ్యులున్న వైద్య బృందం బాబాకు చికిత్స చేసింది.

హృదయ స్పందన సక్రమంగా లేకపోవటంతో బాబా శ్వాస స్వయంగా తీసుకోలేకపోయారు. దాంతో.. వెంటిలేటర్ ద్వారా కృత్రిమంగా శ్వాస అందించారు. ఆ క్రమంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరటంతో చికిత్స ద్వారా వాటిని తొలగించారు. హృదయ స్పందనను సరిచేయటం కోసం పేస్‌మేకర్‌ను అమర్చారు. యూరిన్ అవుట్‌పుట్ సరిగ్గా లేకపోవటంతో మూత్రపిండాల్లో సమస్య ఉందని గుర్తించిన వైద్యులు.. సీఆర్‌ఆర్‌టీ పద్ధతిలో డయాలసిస్ చేశారు. ఇదే తరహా చికిత్సను మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకూ అందించారు. కానీ.. వైద్యానికి బాబా అవయవాల స్పందన ఆశించిన మేరకు లేకపోయింది. ఏప్రిల్ 4న సాయంత్రం 5 గంటలకు బాబా ఆరోగ్యం విషమించింది. అయితే.. వైద్యులు అందించిన చికిత్స వల్ల ఆ సాయంత్రం 8 గంటలకే బాబా ఆరోగ్యం ఒకింత కుదుటపడింది. దాంతో.. అదే తరహా చికిత్సను కొనసాగిస్తూ వచ్చారు. ఏప్రిల్ 7న బాబాకు కామెర్లు సోకాయి. కాలేయం పూర్తిగా చెడిపోయింది. దాంతో.. బాబా మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్‌కు గురయ్యారు. అన్ని అవయవాలకు చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. ఏప్రిల్ 21 నాటికి బాబా ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆ తర్వాత వైద్యులు అందించిన చికిత్సకు బాబా అవయవాలు స్పందించలేదు. చివరకు గుండె, శ్వాస వ్యవస్థలు చెడిపోవటంతో ఆదివారం ఉదయం 7:40 గంటలకు బాబా కన్నుమూశారు. సత్యసాయి బాబా పరమపదించినట్లు సిమ్స్ డెరైక్టర్ ఎ.ఎన్.సఫాయా ఆదివారం ఉదయం 10:15 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో అధికారికంగా ప్రకటించారు.

పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు

బాబా పరమపదించారనే సమాచారం తెలియగానే సత్యసాయి కుటుంబ సభ్యులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్యసాయి కుటుంబ సభ్యులు, బంధువులు సిమ్స్‌లో బాబా పార్థివదేహం ఉన్న ఐసీయూలోకి వెళ్లి కన్నీటి నివాళులు అర్పించారు. బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. బాబా ఇక లేరు అన్న వార్తను విన్న ప్రముఖులు పుట్టపర్తికి తరలివచ్చారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రత్యేక హెలికాప్టర్‌లో 11:30 గంటలకు పుట్టపర్తికి వచ్చారు. అప్పటికే పుట్టపర్తికి చేరుకున్న మంత్రులు జె.గీతారెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి తదితరులతో కలిసి సిమ్స్‌లో ఐసీయూలో ఉన్న బాబా పార్థివదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సాయిబాబా భౌతికంగా దూరమవ్వటం విశ్వ మానవాళికి తీరని లోటన్నారు. సత్యసాయి ట్రస్టు కార్యక్రమాలు యథాతథంగా నడుస్తాయని సీఎం భరోసా ఇచ్చారు.

ఇదే మాట ట్రస్టు సభ్యులు కూడా చెప్పారు. రాష్ట్రంలో నాలుగు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లాకు సెలవు దినంగా ప్రకటించారు. కడప ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లటానికి ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బాబా మరణవార్త విని.. ఉప ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పుట్టపర్తికి వచ్చారు. బాబా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్, తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్‌లు సిమ్స్‌లో బాబా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, నందమూరి లక్ష్మీపార్వతి, టీవీఎస్ సంస్థల అధినేత శ్రీనివాసన్, టీటీడీ మాజీ చైర్మన్ డి.కె.ఆదికేశవులు తదితరులు బాబా పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


కన్నీటి సంద్రమైన పుట్టపర్తి

సత్యసాయి బాబా భౌతికంగా ఇక లేరన్న సమాచారం విన్న పుట్టపర్తి ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. బాబా పార్థివదేహాన్ని సిమ్స్ అంబులెన్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 2:25 గంటలకు సిమ్స్ నుంచి ప్రశాంతి నిలయానికి తరలించారు. సిమ్స్ నుంచి ఎనుములపల్లి బైపాస్, గోకులం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రశాంతి నిలయానికి బాబా పార్థివ దేహాన్ని తరలించే సమయంలో పుట్టపర్తి ప్రజలు అడుగడుగునా బాబాకు కన్నీటి నివాళులు అర్పించారు. కొబ్బరికాయలు కొట్టి, హారతి ఇచ్చారు. పుట్టపర్తి వీధుల్లో మహారాజులా నడయాడే బాబా మరణించాక.. ఆయన పార్థివ దేహాన్ని అంబులెన్స్‌లో ప్రశాంతి నిలయానికి తరలించటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సిమ్స్ నుంచి ప్రశాంతి నిలయానికి మధ్య దూరం మూడు కిలోమీటర్లు ఉంటుంది. రహదారికి ఇరువైపులా బారికేడ్లు, భారీ భద్రత మధ్య సిమ్స్ నుంచి అంబులెన్స్ ప్రశాంతి నిలయానికి చేరే సరికి మధ్యాహ్నం 3:45 గంటలు అయ్యింది.

ప్రశాంతి నిలయంలో నేరుగా బాబా నివాస మందిరమైన యజుర్వేద మందిరానికి పార్థివదేహాన్ని తరలించారు. అక్కడ బాబా బంధువులు సత్యసాయి పార్థివదేహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు సత్యసాయి బాబా భక్తకోటికి ఎప్పుడూ దర్శనం ఇచ్చే సాయి కుల్వంత్‌హాల్‌లోకి తెచ్చారు. ఉదయం నుంచే భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. భక్తుల సందర్శనార్థం బాబా పార్థివదేహాన్ని సోమ, మంగళవారం సాయి కుల్వంత్‌హాల్‌లోనే ఉంచుతామని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల మధ్య సాయి కుల్వంత్ హాల్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపాయి.
 

No comments:

Post a Comment