భగవాన్ శ్రీ సత్య సాయిబాబా

అవతార పురుషుడు సత్యసాయి * మనిషి రూపంలో ఉన్న మహనీయుడు.. * కోట్లాది మందికి ప్రత్యక్ష దైవం.

Monday, April 18, 2011

సత్యసాయిబాబాకు సీరియస్‌ ! * ట్రస్టు సభ్యులు వీరే... మన సేవే మాధవ సేవ!

satyaa
సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి వర్గాలు ఈ విషయంపై పెదవి విప్పకుండా గుంభనం పాటిస్తున్న వైనం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నది. డాక్టర్‌ సఫాయా తాజా మెడికల్‌ బులిటెన్‌ ఏమాత్రం ప్రోత్సాహకరంగా కనిపించలేదు. బాబా పరిస్థితి ఆందోళనకంగానే ఉందని ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు. డయాలసిస్‌ యథాప్రకారం చేస్తున్నట్లు చెప్పారు. వెంటిలేటర్ల మీదే వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు కూడా చెప్పారు. బాబా ఆరోగ్యంలో ఏ కొంచెమైనా మెరుగుదల కనిపిస్తూ ఉంటే దశలవారీగా ఎప్పటికప్పుడు చికిత్సా విధానంలో మార్పులు చేస్తూ ఉంటారని, బాబా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా, మరింత క్షీణిస్తుండబట్టే... వైద్య విధానంలో ఎలాంటి మార్పులు ఉండటం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.

ప్రశాంతి నిలయంలోని ట్రస్ట్‌... బాబా ఆరోగ్య వవ్యహారాలు తమకు సంబంధంలేదన్నట్లు, అదంతా బాబా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్లే చూసుకుంటున్నారన్నట్లు ప్రవర్తిస్తున్నది. ఇంత కీలకమైన, విషమ స్థితిలో ట్రస్ట్‌ బాబా ఆరోగ్యం గురించి సమగ్రమైన, పారదర్శకమైన సమాచారం ఇవ్వడానికి ఎంతమాత్రం ఉత్సుకత చూపడంలేదు. ట్రస్ట్‌ మీద వస్తున్న ఆరోపణలను దీటుగానే ఎదుర్కొనే కసరత్తులో అది తలమునకలై ఉంది. ట్రస్టు ఆర్థిక వ్యవహారాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని, బాబా నియమించిన సభ్యులతో కూడిన ట్రస్టులు భేషుగ్గా, నిస్వార్థంగా, లాభాపేక్ష రహితంగా పనిచేస్తున్నా యని మాత్రం నాలుగు పేజీల ప్రకటన విడుదల చేశారు.

బాబా ఆరోగ్యం గురించి అందులో అక్షరం ముక్క కూడా లేదు. బాబా ఆరోగ్యానికి తాము పూచీ కాదన్న ధోరణి ఆ ప్రకటనలో కనిపించింది. తమకు అంటుతున్న మకిలి తొలగించుకునే కార్యక్రమంలో భాగంగానే ఆ ప్రకటన వెలువడింది. అయితే భక్తులు మాత్రం ఆ ప్రకటనను విశ్వసించడం లేదు. బాబా అనారోగ్యానికి ఈ ట్రస్టే ప్రధాన కారణమని వారు భావిస్తున్నారు. బాబా ఇప్పుడసలు ఏ దశలో ఉన్నారు? స్పృహలో ఉన్నారా? లేక కోమాలో ఉండిపోయారా? ద్రవాహారమైనా ఇస్తున్నారా? లేదా? ఇలాంటి విషయాలేవీ చెప్పకుండా కప్పదాటు వ్యవహారం నడిపించడంపట్ల భక్తుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్‌ బులిటెన్లు కూడా రాను రాను మొక్కుబడిగా మారాయి. ఆ బులిటెన్లలో బాబా ఆరో గ్యానికి సంబంధించి ఒక్క సానుకూల అంశమైనా ఉండటం లేదు. కిడ్నీలు సక్రమంగా పనిచేస్తే ఇక అంతా చక్కబడ్డట్టే అని తొలి నాళ్లలో ఉత్సాహంగా చెప్పిన ప్యానెల్‌ డాక్టర్లు ఇప్పుడు తీవ్ర నిరుత్సాహంలో ఉండిపోయారు. వారెవరూ దీని గురించి పెదవి విప్పడం లేదు. బాబా ఆరోగ్యం విషమమైందని అనుకోవడానికి ఇదొక్కటి చాలని అంటున్నారు.

కాలేయం కలవరపెడుతోంది
అయినా.. ఆందోళనకరమే: డాక్టర్ సఫాయా

సత్యసాయిబాబా ఆస్పత్రిలో చేరి మూడు వారాలవుతున్నా ఆయన కాలేయం పనితీరు ఇప్పటికీ కలవరపెడుతోందని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సఫాయా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన బాబా ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల చేశారు.

"బాబా ఆరోగ్యం నిలకడగా ఉంది. కాలేయం పనితీరు డాక్టర్లను కలవరపాటుకు గురి చేస్తోంది. బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది'' అని సఫాయా తెలిపారు. కాగా.. సఫాయా తీరుపై బాబా కుటుంబ సభ్యులు, భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సత్యసాయి ఆరోగ్యంపై 29లోగా నివేదిక
సీఎస్‌కు మానవహక్కుల కమిషన్ ఆదేశం

సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 29లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు లాయర్లు కె.కృష్ణవిజయ్ ఆజాద్, కరంచంద్; దళిత జనసభ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గద్ద శ్రీనివాసు, జి.వినోద్‌కుమార్‌లతో పాటు మరోవ్యక్తి వేర్వేరుగా దాఖలు చేసిన మూడు పిటిషన్లపై కమిషన్ తాత్కాలిక చైర్‌పర్సన్ పెద పేరిరెడ్డి ఈ మేరకు స్పందించారు.

విచారణ 20కి వాయిదా

పెనుకొండ: సత్యసాయికి అందిస్తున్న వైద్యసేవలు, ఆయన ఆరోగ్యంపై ప్రకటనల్లో అస్పష్టతపై అనంతపురం జిల్లా పెనుకొండ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. 

ట్రస్టు సభ్యులు వీరే...

గత ఏడాది మార్చి నెలలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టును పునర్ వ్యవస్థీకరించినట్లు రత్నాకర్ రాజు తన ప్రకటనలో చెప్పారు. ఆయన చెప్పిన ట్రస్టు స్వరూపం ఇదీ...
1. భగవాన్ సత్యసాయి బాబా, ఫౌండర్ ట్రస్టీ
2. జస్టిస్ పి.ఎన్.భగవతి, మాజీ ప్రధాన న్యాయమూర్తి
3. ఇందూలాల్ షా, చార్టెడ్ అకౌంటెంట్, ముంబై
4. ఎస్వీ గిరి, సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్
5. వి.శ్రీనివాసన్, సీఐఐ మాజీ అధ్యక్షుడు
6. ఆర్.జె.రత్నాకర్, ప్రశాంతి నిలయం.
వీరు కాకుండా ట్రస్టు నిర్వహణకు ఒక ప్రత్యేక మండలి (కౌన్సిల్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఉంది. అందులోని సభ్యులు...
1. ఎస్ఎస్ నాగానంద్, న్యాయవాది, బెంగళూరు
2. జేవీ షెట్టి, కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్
3. టీకేకే భగవత్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ మాజీ చైర్మన్
4. కె.చక్రవర్తి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

మన సేవే మాధవ సేవ!
ఇదీ ట్రస్టులోని కొందరి తీరు
సత్యసాయి లక్ష్యానికి తూట్లు
తమిళనాడు హవా

'మానవ సేవే మాధవ సేవ'... ఇది భగవాన్ సత్యసాయి నినాదం, విధానం! ఇందులో భాగంగానే ఆయన బృహత్తర సేవా యజ్ఞం ప్రారంభించారు. అనంతపురం జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, ఉభయ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకూ తాగునీటిని అందించారు. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. అనేక సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నారు.

అయితే... ప్రధాన ప్రాజెక్టులన్నీ 1995కు ముందే అమలయ్యాయి. బాబా ప్రతి ఏటా తన పుట్టిన రోజున ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ప్రకటించే సంప్రదాయమూ వెనక్కి వెళ్లిపోయింది. ఒకప్పుడు జోరుగా సాగిన సేవా యజ్ఞం... ఐదారేళ్లుగా క్రమంగా నీరుగారిపోతోంది. అంతకంతకు విస్తరిస్తున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సజావుగా నడిచేందుకు వీలుగా బాబా1972లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి బాబాయే అధ్యక్షుడు. 2003 వరకు ట్రస్టు వ్యవహారాలను బాబా స్వయంగా పర్యవేక్షించేవారు.

తర్వాత ఆయన అనారోగ్యానికి గురి కావడం, వయసు మీదపడటం, తన సోదరుడు జానకి రామయ్య మరణించడం... వీటన్నింటి నేపథ్యంలో ట్రస్టు వ్యవహారాలను పూర్తిగా పర్యవేక్షించలేకపోయారు. మెల్ల మెల్లగా బాబా కంటే ట్రస్టులోని కొందరు వ్యక్తులే శక్తిమంతమయ్యారు. చివరికి... సత్యసాయిని బందీగా మార్చేశారు.

ప్రస్తుతం సత్యసాయి సెంట్రల్ ట్రస్టులో బాబాతో సహా ఆరుగురు సభ్యులు, మేనేజ్‌మెంట్ కౌన్సిల్‌లో నలుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు ఏళ్లతరబడి ట్రస్టులో పాతుకుపోయారు. ఇప్పటిదాకా ట్రస్టు కార్యదర్శులుగా పని చేసిన కుటుంబరావు, నారాయణరావు, చిరంజీవి, ప్రస్తుత కార్యదర్శి చక్రవర్తి... వీరంతా తమిళనాడుకు చెందిన వారే. ప్రస్తుతం ట్రస్టు చక్రవర్తి వర్గం, చక్రవర్తి వ్యతిరేక వర్గంగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రస్టు సభ్యులు, వారి బాధ్యతల వివరాలు ఇవి...

ప్రపంచ వ్యాప్తంగా...

సత్యసాయి సంస్థలకు 145 దేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఆయా దేశాల భక్తులు విరాళాలు జమ చేస్తుంటారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కాకుండా... ఈశ్వరమ్మ సత్యసాయి మహిళాభివృద్ధి, సంక్షేమ ట్రస్ట్, సత్యసాయి సేవాదళ్‌తోపాటు మరో ఐదు సంస్థలు ఉన్నాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకే ప్రత్యేకంగా 130 దేశాల్లో ఖాతాలు ఉన్నాయి. 140 దేశాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రస్ట్ వ్యవహారాల్లో రత్నాకర్‌కు మినహా... బాబా కుటుంబ సభ్యులెవరికీ ప్రాధాన్యం లేదు. బాబా అక్క పార్వతమ్మ కూతురు చేతన బాధ్యతలు చూస్తున్న ఈశ్వరమ్మ ట్రస్టుకు పెద్దగా వనరులు లేవు.

ఎస్‌వీ గిరి:
ఈయన తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ఎక్కువగా కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సత్యసాయికి పరమ భక్తుడు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ... ఉద్యోగానికి రాజీనామా చేశారు. సాయి పిలుపు మేరకు పుట్టపర్తికి వచ్చేశారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్‌గా ఆరేళ్లపాటు ఉన్నారు. తర్వాత... ట్రస్టులో సభ్యుడిగా చేరారు. విద్యా సంస్థల నిర్వహణను పర్యవేక్షిస్తారు.

చక్రవర్తి
1975-76 మధ్య అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. అప్పుడే ఆయనను పుట్టపర్తి వ్యవహారాలు ఆకర్షించాయి. కలెక్టర్ హోదాలో తరచూ పుట్టపర్తికి వెళుతూ బాబాను దర్శించుకునే వారు. ఇలా... పోతూ సత్యసాయికి బాగా దగ్గరయ్యారు. 1982లో ఐఏఎస్ పదవికి రాజీనామా ఇచ్చేశారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా బాబా కొలువులో చేరారు. 1998 వరకు ఆయన రిజిస్ట్రార్‌గా ఉన్నారు. తర్వాత... ట్రస్టులో కాలు పెట్టారు. కార్యదర్శిగా మారారు. పుట్టపర్తి వ్యవహారాల్లో అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగారు. ప్రశాంతి నిలయంలో చక్రవర్తి ఎంత చెబితే అంత! ఒక్కముక్కలో చెప్పాలంటే, పుట్టపర్తికి ఆయన మకుటంలేని 'చక్రవర్తి'. ఆయన భార్యా పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఆయన మాత్రం ప్రశాంతి నిలయంలో ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో బాబా తర్వాతి స్థానం చక్రవర్తిదే. కొన్ని నిర్ణయాలను బాబా వరకు తీసుకెళ్లకుండానే తీసుకుంటారని చెబుతారు.

మద్రాస్ శ్రీనివాసన్
ట్రస్టులో చక్రవర్తి తర్వాత కీలక వ్యక్తి మద్రాస్ శ్రీనివాసన్. ఆయన తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఎస్వీ ఇండస్ట్రీస్ పేరిట విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. బడా పారిశ్రామికవేత్త కావడంతో ఆయనకు బాబా ప్రత్యేక దర్శనం లభించేది. ఇలా ఆయన సత్యసాయికి దగ్గరయ్యారు. ఇప్పుడు ట్రస్టు సభ్యుడు మాత్రమే కాదు... అఖిల భారత సత్యసాయి సేవా సమితికి శాశ్వత అధ్యక్షుడు కూడా! విదేశాల నుంచి విరాళాలు సేకరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే... అనారోగ్యంతో బాధపడుతున్న సత్యసాయికి యుద్ధ ప్రాతిపదికన వైద్యం చేసేందుకు డాక్టర్లు ఉపక్రమించగా... రాహుకాలం పేరిట శ్రీనివాస్ గంటపాటు ఆపేశారనే ఆరోపణ ఉంది.

ఇందూలాల్ షా
ముంబైకి చెందిన ప్రఖ్యాత చార్టెడ్ అకౌంటెంట్. పెద్ద కంపెనీలు, బ్యాంకులకు ఆడిటర్‌గా పని చేశారు. బాబాకు భక్తులుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు ఇందూలాల్ షాను సత్యసాయికి పరిచయం చేసినట్లు చెబుతారు. క్రమంగా ఆయన బాబాకు దగ్గరయ్యారు. ట్రస్టు సభ్యుడిగా మారారు. మహారాష్ట్రలో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, జమా ఖర్చులు ఆయనే చూసుకుంటారు.

జేవీ షెట్టి
బెంగళూరులోని అత్యంత ధనికుల్లో జేవీ షెట్టి ఒకరు. ఆయన ప్రముఖ న్యాయవాది, ఆడిటర్. చాలా ఏళ్లుగా బాబా భక్తుడు. ట్రస్టు ఆస్తులు, విదేశాల్లో ఉండే సంస్థల నిర్వహణను పర్యవేక్షిస్తారు.

జస్టిస్ భగవతి
భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు పెద్ద పీట వేస్తూ, వాటి ప్రాధాన్యాన్ని పెంచిన న్యాయమూర్తిగా ఖ్యాతి సంపాదించారు. ఢిల్లీకి చెందిన భగవతి... సత్యసాయి బాబా భక్తుడిగా పుట్టపర్తికి వచ్చే వారు. తర్వాత... ట్రస్టులో సభ్యుడిగా మారారు. పదేళ్లుగా ట్రస్టులో కొనసాగుతున్నారు.

నాగానంద
కర్ణాటకకు చెందిన ప్రముఖ న్యాయవాది. బాగా డబ్బున్న ఆసామి. బాబాకు పరమ భక్తుడు. ట్రస్టు సభ్యుడిగా నియమితులయ్యారు. విదేశాల్లో ఉండే సంస్థలను చూసుకుంటారు.

రత్నాకర్
సాయిబాబా సోదరుడైన జానకిరామయ్య కుమారుడే రత్నాకర్. సెంట్రల్ ట్రస్టు సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరే. రత్నాకర్ ఎంబీఏ చదివారు. జానకి రామయ్య మరణం తర్వాత రత్నాకర్‌ను ట్రస్టులోకి తీసుకోవాలని భావించినప్పటికీ.... కొందరు ఇతర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరికి... ఏడాదిన్నర క్రితం ఆయనకు ట్రస్టులో సభ్యత్వం లభించింది. రత్నాకర్ అంటే చక్రవర్తికి అస్సలు గిట్టదనే ప్రచారం ఉంది. రత్నాకర్ ప్రతిరోజూ సత్యసాయి వద్దకు వెళ్లడం, ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీయడం వంటివి చక్రవర్తికి ఇష్టం లేదని చెబుతారు.

పాపాల పుట్ట పగులుతోంది
లెక్కలు తనిఖీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
గుట్టలుగా పడి ఉన్న భక్తుల విరాళాల పత్రాలు
బాబా ఆస్పత్రిలో చేరాక చక్రవర్తి ఎంట్రీల నమోదు!

సాయి బరువు 40 కిలోలే..
విషమిస్తున్న పరిస్థితి
పుట్టపర్తికి భగవతి, సీనియర్ సభ్యులు!
భగవాన్ బాబా... ఆయన చుట్టూ కొందరి గూడు పుఠాణీ! ఈ మాయలపై 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాల దెబ్బకు ట్రస్టు స్పందించింది. అది కూడా తూతూ మంత్రంగానే! సందేహాలకు సమాధానాలు చెప్పకుండానే! ఇన్నాళ్లుగా నిద్దరోయిన నిఘా కళ్లు కూడా ఇప్పుడు తెరుచుకుంటున్నాయి.

బాబాకు హాని జరిగితే అందుకు ట్రస్టు సభ్యులదే బాధ్యత అంటూ బీసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబా పరిస్థితిపై ఈనెల 29లోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ సర్కారును ఆదేశించింది. ఇప్పుడు బాబా చిత్రాలను చూడాలని భక్తులెవరూ కోరుకోవడంలేదని, మీడియానే కోరుకుంటోందని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. బాబా కాలేయం పనితీరు కలవరపరుస్తోందని సఫాయా పేర్కొన్నారు.

పుట్టపర్తిలో అక్రమాల పుట్ట పగులుతోంది. ఆంధ్రజ్యోతి మొదటినుంచీ చెబుతున్నది నిజం అవుతోంది. బాబాకు కానుకల రూపంలో వచ్చిపడుతున్న అశేష ధన కనక వస్తు వాహనాలకు లెక్కా పత్రం ఉండడం లేదన్న భక్తుల ఆందోళన వాస్తవమని తేలుతోంది. కొంతకాలంగా బాబాకు వచ్చిన కానుకలేవీ ఇంతవరకూ రికార్డుల్లో నమోదు కాలేదని, ఇప్పుడు హడావుడిగా ఆ పని మొదలుపెట్టారనేది వెల్లడైంది. మరోవైపు బాబా ఆరోగ్యం సోమవారానికి మరింత విషమించింది. ఆయన బరువు 40 కిలోలకు పడిపోయినట్లు సమాచారం.

అసలు పుట్టపర్తి ట్రస్టులో ఏం జరుగుతోంది? ఆర్థిక నిర్వహణ ఎలా ఉంది? లెక్కా పత్రం సక్రమంగానే ఉన్నాయా? మీడియాలో వస్తున్న కథనాలు, భక్తుల్లో పెల్లుబుకుతున్న ఆందోళనల్లో వాస్తవమెంత? తదితర అంశాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లెంకా వెంకట సుబ్రహ్మణ్యాన్ని పుట్టపర్తికి పంపారు. ఈ నెల 3వ తేదీన సుబ్రహ్మణ్యం పుట్టపర్తి వెళ్లినా అక్కడ ట్రస్టు సభ్యుల నుంచి ఆయనకు ఎటువంటి సహకారం లభించలేదు.

కానీ విమర్శల జడివాన పెరుగుతుండడంతో ప్రభుత్వం ఆయనను మళ్లీ పంపించింది. స్వతహాగా సాయి భక్తుడు, సాయి విద్యాసంస్థల విద్యార్థి కూడా అయిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం ట్రస్టు సభ్యులతో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని లెక్కల్ని తనిఖీ చేశారు...అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... సుబ్రహ్మణ్యం వెళ్లే సమయానికి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి చాలా బిజీగా ఉన్నారు. బాబా ఆరోగ్యం విషయంలో కాదు... లెక్కల్లో! ఆయన టేబుల్‌పై వందలకొద్దీ డొనేషన్ పత్రాలున్నాయి.

బాబా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ట్రస్టులో కీలక వ్యక్తి అయిన చక్రవర్తి బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బాబా గురించి భక్తులకు ఆయన భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ లెక్కల్లో మాత్రం బిజీగా ఉన్నారు. మిగతా ఆలయాల్లో మాదిరిగా సత్యసాయి బాబా మందిరంలో హుండీలు ఉండవు. భక్తులు ఇచ్చే కానుకలను ట్రస్టుకే అందించాలి. సత్యసాయి ట్రస్టుకు అనేక చెక్కులు, ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, విలువైన వస్తువులు, ఆస్తులు విరాళాలుగా వస్తుంటాయి. భక్తులు వీటికి తమ లేఖలను జత చేసి పంపుతుంటారు.

ఈ విరాళాలన్నింటినీ ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి ఇతరుల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. అయితే బాబా ఆసుపత్రిలో చేరి మూడు వారాలు గడిచిపోయాక కూడా కార్యదర్శి చక్రవర్తి ఇంకా డొనేషన్ పత్రాలను ముందేసుకుని రికార్డుల్లో నమోదు చేస్తున్నారంటే ఇంతకాలం ఎందుకు నమోదు చేయలేదు? ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మీడియాలో ఆరోపణలు రావడంతో జాగ్రత్త పడేందుకే ఇప్పుడు ఎంట్రీలు మొదలుపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన తనిఖీల్లో ఇంకా ఏయే విషయాలు బయటపడ్డాయో చెప్పడానికి ఎల్.వి.సుబ్రహ్మణ్యం విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ స్థాయిలో అయినా దీనిపై సమగ్ర విచారణ జరుపుతారా? ట్రస్టు వ్యవహారాలతో మాకు సంబంధం లేదని వదిలేస్తారా? అన్నది వేచిచూడాలి. మరోవైపు బాబా ఆరోగ్య పరిస్థితి సోమవారానికి మరింత విషమించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన బరువు 40 కిలోలకు పడిపోయింది. శరీరంలో ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి.

బాబా ఆహారం తీసుకోకపోవడంతోపాటు... ఆయనకు కొంతకాలంగా సరైన వైద్య చికిత్స చేయకుండా అడ్డమైన మందులూ మింగించడమే ఆయన దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండడంతో ట్రస్టు సీనియర్ సభ్యులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్.భగవతి, కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ ఎస్.వి.గిరి, చెన్నైకి చెందిన శ్రీనివాసన్ పుట్టపర్తికి చేరుకుంటున్నారు. వీరు వచ్చాక ట్రస్టు వ్యవహారాలపై మరింత విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

దుర్వినియోగం అబద్ధం!
నగదు రూపంలో విరాళాలు స్వీకరించం
చెల్లింపులూ నగదు రూపంలో ఉండవు

నిధులు దారిమళ్లే అవకాశమే లేదు
ట్రస్టులో పక్కా అకౌంటింగ్ వ్యవస్థ
ప్రభుత్వ విభాగాలకు ఏటా ఆడిట్ నివేదికలు
ట్రస్టు సభ్యులను బాబాయే నియమిస్తారు
చెక్ పవర్ సత్యసాయికి మాత్రమే ఉంది
అసత్య కథనాలను విశ్వసించవద్దు
బాబా భక్తులకు ట్రస్టు సూచన
ట్రస్టు తరపున రత్నాకర్ ప్రకటన
పుట్టపర్తి, ఏప్రిల్ 18 : ఎట్టకేలకు, ఇన్నాళ్లకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్పందించింది. ట్రస్టు వ్యవహారాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు సూచించింది. 'ట్రస్టు సభ్యుల ఆమోదం మేరకు'... బాబా తమ్ముడి కుమారుడు, ట్రస్టు సభ్యుల్లో ఒకరైన రత్నాకర్ సోమవారం 4 పేజీల ప్రకటన విడుదల చేశారు. ఇందులో అధిక భాగం ట్రస్టు, దాని కూర్పు, సత్యసాయి మార్గదర్శకత్వంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించేందుకే కేటాయించారు.

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి మెడికల్ ట్రస్టు, సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ మొదలైన ట్రస్టులన్నీ ట్రస్ట్ డీడ్స్‌లో నిర్దేశించిన స్పష్టమైన నిబంధనల మేరకు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ట్రస్టులకు ఆదాయపు పన్ను శాఖ, విదేశీ విరాళాల నియంత్రణ చట్టంతోపాటు ఇతర చట్టాల మేరకు గుర్తింపు ఉందని తెలిపారు.

"ట్రస్టు సభ్యులు, నిర్వహణ మండలి సభ్యులను సత్యసాయి స్వయంగా ఎంపిక చేసుకుని నియమించారు. వీరెవరూ ట్రస్టు నుంచి ఆర్థికంగాకానీ, ఇతరత్రాగానీ ఎలాంటి ప్రయోజనాలు పొందరు. ట్రస్టు నిధులను అందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకే వినియోగమయ్యేలా సభ్యులు పూర్తి జాగ్రత్త వహిస్తారు. సత్య సాయిబాబా ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటారు'' అని రత్నాకర్ తెలిపారు.

బ్యాంకులు, చెక్కుల ద్వారా మినహా... నగదు రూపంలో ట్రస్టు విరాళాలు సేకరించదని ఆయన స్పష్టం చేశారు. "ట్రస్టు ఆస్తులు, లావాదేవీలపై నిబంధనల ప్రకారం ఆడిటింగ్ నిర్వహించి... ఆదాయ, వ్యయాలపై ఎప్పటిప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత విభాగాలకు సమర్పిస్తాం. ట్రస్టులో పకడ్బందీ అకౌంటింగ్ వ్యవస్థ అమలవుతోంది. నిధులను దారి మళ్లించడానికి, దుర్వినియోగం కావడానికి అవకాశమే లేదు'' అని రత్నాకర్ తెలిపారు.

విరాళాల సేకరణ ఇలా...

ట్రస్టుకు అందే విరాళాలు, చేసే ఖర్చు గురించి రత్నాకర్ ప్రత్యేకంగా వివరించారు. "భక్తులు తమ విరాళాలను ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాంకులో నేరుగా జమ చేస్తారు. ఒకవేళ... బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత ఎవరైనా విరాళాలు సమర్పించాలనుకుంటే, బ్యాంకుకు చెందిన డెబిట్ కార్డు యంత్రాల ద్వారా ఇవ్వవచ్చని సూచిస్తాం.

ట్రస్టు సిబ్బంది ఎవరూ నగదు రూపంలో విరాళాలు సేకరించరు. అందువల్ల అనామతు ఖాతాలో పడే ప్రశ్నే తలెత్తదు. ట్రస్టుకు చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో వచ్చే విరాళాలను ట్రస్టు ఫైనాన్స్ ఆఫీసర్ ఏరోజుకారోజు బ్యాంకులో జమ చేస్తారు. విదేశాల నుంచి వచ్చే విరాళాలన్నీ ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, 1976 మేరకు హోంమంత్రిత్వ శాఖ ఆమోదం మేరకే ఈ ఖాతాలో లావాదేవీలు జరుగుతున్నాయి. చెక్కులు, డ్రాఫ్టులు పంపిన వారికి ట్రస్టు కార్యదర్శి స్వయంగా సంతకం చేసిన రసీదులను వారి చిరునామాలకు పంపిస్తాం'' అని రత్నాకర్ వివరించారు.

బాబా ఆమోదం మేరకే...

ట్రస్టు చేపట్టిన అన్ని పనులు, ప్రాజెక్టులు ఫౌండర్ ట్రస్టీ (అంటే సత్యసాయిబాబా) ఆమోదం మేరకే జరుగుతాయని రత్నాకర్ తెలిపారు. "ఇలా ఆమోదించిన పనులు, ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధుల విడుదలకోసం జారీ చేసే చెక్కులపై సంతకం చేసే అధికారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకు మాత్రమే ఉంది. కాంట్రాక్టర్లు, సప్లయర్లందరికీ అకౌంట్ పేయీ డీడీల రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి. లేదా... వారి ఖాతాల్లోకి నేరుగా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బు జమ అవుతుంది.

అంతేకానీ, నగదు రూపంలో ఎవరికీ చెల్లింపులు ఉండవు. విదేశీ విరాళాల వార్షిక ఆడిట్ పట్టికను, వచ్చిన నిధులు, వాటిని వినియోగ వివరాలను ప్రతి సంవత్సరం హోం శాఖకు సమర్పిస్తాం. ఆడిట్ చేసిన ఆర్థిక పట్టికలను ఆదాయపు పన్ను శాఖతో సహా సంబంధిత విభాగాలన్నింటికీ పంపిస్తాం'' అని చెప్పారు.

కాగా.. ట్రస్టు సభ్యుల మధ్య ఎలాంటి అంతరం లేదని రత్నాకర్ స్పష్టం చేశారు. ట్రస్టు వ్యవహారాలపై వస్తున్న కథనాలను అవాస్తవాలని, వక్రీకరణలని తెలిపారు. "ఇవన్నీ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. భక్తులు ప్రశాంత చిత్తంతో ఉండండి. భగవాన్ సత్యసాయి ఆరోగ్యం కోసం ప్రార్థించడానికే ప్రాధాన్యం ఇవ్వండి'' అని సూచించారు.

నమ్మొద్దంటే సరిపోతుందా?

ఒకవైపు 'ఆంధ్రజ్యోతి' వరుస కథనాలు... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ దృష్టి... నేపథ్యంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్పందించింది. అది కూడా తూతూమంత్రంగానే! మీడియాను పక్కనపెట్టినా... అశేష భక్తుల సందేహాలకు సమాధానాలు లేవు. సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై కనీస వివరణ లేదు. ట్రస్టు మౌనంగా ఉండటం తగదని... నోరు విప్పాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సూచించిన మరుసటి రోజే ఈ ప్రకటన జారీ కావడం గమనార్హం.

ట్రస్టులో సీనియర్లు ఎందరో ఉండగా... ఏడాదిన్నర కిందట సభ్యుడిగా చేరిన రత్నాకర్ సంతకంతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రత్నాకర్ సత్యసాయి కుటుంబ సభ్యుడైనందున ఆయన ప్రకటనకు 'విశ్వసనీయత' ఉంటుందనే ఇలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. ఇప్పటి దాకా వ్యక్తమైన సందేహాలకు సమాధానాలు చెప్పకుండా... 'అసత్య కథనాలను నమ్మొద్దు' అంటే సరిపోతుందా?! 

ట్రస్టు సభ్యులపై కేసు పెట్టాలి
సత్యజిత్‌పై చర్యలు తీసుకోండి
డీఎస్పీని తప్పించాలి
బీసీ కులాల ఐక్యవేదిక ఫిర్యాదు

సత్యసాయిబాబా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ... ఆయన ఆస్తులను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ట్రస్ట్ సభ్యులపై బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబాకు ప్రాణహాని జరిగితే అందుకు ట్రస్టు సభ్యులనే బాధ్యులుగా చేయాలన్నారు.

సోమవారం ఆయన పుట్టపర్తి అర్బన్ సీఐ విఠలేశ్వర్‌కు ఫిర్యాదు పత్రం అందించారు. "సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తితో పాటు ట్రస్టు సభ్యులు, బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌లపై చర్యలు తీసుకోవాలి. ట్రస్ట్‌లో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బాబా ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మూడు వారాలుగా బాబా ఆరోగ్య పరిస్థితిపై గోప్యత పాటిస్తున్నారు. ప్రశాంతి నిలయంలో ఆస్తులను దోచుకునేందుకు కుమ్ములాట జరుగుతోంది. డీఎస్పీ నరసింహులును కూడా అక్కడి నుంచి తప్పించాలి'' అని నాగరాజు తన ఫిర్యాదులో కోరారు. నాగరాజు వెంట మీడియాను పోలీసులు ఠాణా బయటే అడ్డుకున్నారు. నాగరాజు ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం కేసును నమోదు చేస్తామని సీఐ హామీ ఇచ్చారు

ప్రశాంతి నిలయంపై నిఘా వర్గాల దృష్టి

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌లో జరుగుతున్న అవకతవకలపై నిఘావర్గాలు, పోలీసులు ముందస్తు సమాచారం సేకరించడంలో విఫలమైనట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారని.. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

దీనిలో భాగంగా బాబా ఆరోగ్యం గురించి సరైన సమాచారం ఇవ్వనందుకు- పుట్టపర్తి డీఎస్పీ నరసింహులు, సీఐ విఠళేశ్వర్‌లకు డీఐజీ చారుసిన్హా మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. దీనితో పాటుగా ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దీనితో సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రస్ట్ సభ్యుల వ్యవహారం, వారి చరిత్ర, సత్యజిత్త్ వ్యవహారం గురించి వీరు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర నిఘావర్గాలతోపాటు కేంద్ర నిఘావర్గాలు కూడా వేరువేరుగా విషయ సేకరణలో మునిగినట్టు తెలిసింది. ట్రస్ట్‌కు సంబంధించి స్థిర, చరాస్తుల వివరాలు 15రోజుల్లోగా అందించాలని ఉన్నతస్థాయి అధికారులు డెడ్‌లైన్ పెట్టడంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ట్రస్టు అవకతవకలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించినట్టు తెలిసింది.

No comments:

Post a Comment